హరీష్ పై కవిత ప్రత్యక్ష యుద్ధం…నెక్స్ట్ ఎవరో.?

Kavitha Harish Rao clash

కవిత లో ఇన్నాళ్లుగా దాగున్న ఆవేశం ఒక్కసారిగా కట్టలు తెగిందా.? తెలంగాణలో వరదల మాదిరి కవిత బిఆర్ఎస్ ముఖ్య నాయకుల పై విమర్శనా బాణాలు వేసిందా అన్నట్టుగా నేడు మీడియా ముందుకొచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెళ్ళగక్కింది.

కేసీఆర్ పై సీబీఐ దర్యాప్తు అంటూ రేవంత్ సర్కార్ ప్రకటించడంతో కలత చెందిన కవిత తన తండ్రి పై అవినీతి మరకలు పడడానికి ముఖ్య కారణం నాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్, నాటి ఎంపీ సంతోష్ అంటూ మండిపడ్డారు.

ADVERTISEMENT

కేసీఆర్ ను అడ్డుపెట్టుకుని బిఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ చేసిన అవినీతి కి గాను బిఆర్ఎస్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత హరీష్ ను నీటి పారుదల శాఖ మంత్రిగా తప్పించారంటూ నాటి ఉదంతాన్ని నేటి ఉదాహరణగా జోడించారు కవిత.

కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు వరకు వెళ్లిందంటే అది కేసీఆర్ పరువు ప్రతిష్టలకు భంగం కాదా.? కేసీఆర్ కూతురుగా తనకు బాధ ఉండదా.? అంటూ ప్రశ్నిస్తూనే బిఆర్ఎస్ ముఖ్య పిల్లర్లలో ఒకరైన హరీష్ వైపే వేలెత్తి చూపుతున్నారు, ఆయనకే అవినీతి మరకలు వేస్తున్నారు.

ఇన్నాళ్ల కేసీఆర్ రాజకీయ జీవితం లో ఎన్నడూ లేని అవినీతి మరకలు నేడు హరీష్, సంతోష్ కారణంగా కేసీఆర్ ను తకాయంటున్న కవిత కేసీఆర్ కు ధన వ్యామోహం లేదని, ఈ అవినీతి మరకలు వెనుక హరీష్, సంతోష్, మేఘా కృష్ణా రెడ్డి లు ఉన్నారంటూ ఆరోపణలకు దిగిన కవిత వ్యాఖ్యలకు అటు హరీష్ ఇటు కేటీఆర్ ఎలా స్పందించనున్నారో వేచి చూడాలి.

రేవంత్ తో తెరచాటు రాజకీయం నడుపుతున్న కొంతమంది నేతలే కేసీఆర్ కు ఈ స్థితిని తీసుకొచ్చారని, అటువంటి పరిస్థితి వరకు కేసీఆర్ వెళ్లారంటే ఇంకా పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ బిఆర్ఎస్ ఉనికి పై కూడా కవిత పరోక్ష బాణాలు వేశారు.

అయితే ఇన్నాళ్లుగా కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ కవిత చేసిన పరోక్ష విమర్శలు హరీష్ ను ఉద్దేశించేనా.? అన్న చర్చ జరుగుతుంది. తానూ కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ కావడానికి, తానూ బిఆర్ఎస్ కు దూరంగా జరగడానికి, తనకి తన తండ్రి కేసీఆర్ కి మధ్య గ్యాప్ రావడానికి కూడా హరీష్, సంతోషే కారణం అనేలా కవిత బిఆర్ఎస్ పార్టీలో హరీష్ చిచ్చు రేపారు.

మరి కవిత నేరుగా హరీష్ ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ కు మద్దతు పలకడంతో కేసీఆర్ కవిత చర్యల పై ఎలా స్పందిస్తారు.? కవిత నెక్స్ట్ టార్గెట్ ఎవరవుతారు.? అన్న చర్చ ఊపందుకుంది. హరీష్ రావు తో మొదలైన కవిత గులాబీ యుద్ధం ఎందాక వెళ్తుందో.? ఎవరిని టార్గెట్ చేస్తుందో అన్న ఆందోళన బిఆర్ఎస్ శ్రేణులలో మొదలయ్యింది.

ADVERTISEMENT
Latest Stories