కవిత: “బీఆర్ఎస్ అవినీతిలో నాకు భాగం లేదు!”

Kavitha Harish Rao corruption Allegations

బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాగిస్తున్న రాజకీయ ప్రయాణంలో నేడు మరో కీలక అంకం తెరపైకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అంగీకరిస్తూనే… ఆ అవినీతిలో తనకు ఎలాంటి భాగస్వామ్యం లేదంటూ ఆమె బహిరంగంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
​
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయంపై కవిత తాజాగా స్పందించారు. ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న భూములలో తన పేరు మీద కానీ, తన కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఒక్క సెంటు భూమి కూడా లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో, బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలకు అక్కడ భారీగా భూములు ఉన్నాయంటూ ఆమె బాంబు పేల్చారు.
​
హరీశ్‌రావుపై సంచలన ఆరోపణలు:

పార్టీలో తన ప్రత్యర్థిగా భావిస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావును టార్గెట్ చేస్తూ కవిత మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు తన హయాంలో వందల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించి నిమ్స్ (NIMS) నుంచి తనకు లేఖ కూడా వచ్చిందని చెబుతూ కొన్ని ఆధారాలను బయటపెట్టారు.

ADVERTISEMENT

హరీశ్‌రావు హయాంలో ఉద్యోగులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రూ.25 కోట్ల ఈపీఎఫ్ (EPF) నిధులను ఇతర ఖాతాలకు మళ్లించారని, దీనిపై ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు.
​
నాడు మౌనం.. నేడు గళం:

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నత పదవుల్లో కొనసాగిన కవిత… నాటి ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో తనకు ఎటువంటి సంబంధం లేదని కుండబద్దలు కొడుతున్నారు. అయితే, నాటి ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నప్పుడు ఈ అక్రమాలపై నోరుమెదపని కవిత, నేడు సొంత పార్టీ నేతలనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తుండటం పట్ల విశ్లేషకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు.
​
హరీశ్‌రావును టార్గెట్ చేస్తూ కవిత చేస్తున్న ఈ అవినీతి ఆరోపణల్లో నిజానిజాలు ఏమైనప్పటికీ… నాటి ఆమె మౌనం, నేడు ఆమె చేస్తున్న విమర్శల బలాన్ని నీరుగారుస్తోందనేది కాదనలేని వాస్తవం.

ADVERTISEMENT
Latest Stories