కేసీఆర్ అనే పేరు కన్నా టిఆర్ఎస్ అనే బ్రాండ్ కే విలువెక్కువా.?

Kavitha TRS brand debate

బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుతో బయటకొచ్చిన కవిత కేసీఆర్ ని వదులుకోవడానికి సైతం వెనుకాడలేదు. కేసీఆర్ చిత్ర పటం లేకుండానే తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెడతా, కేసీఆర్ పేరు ఎత్తకుండానే సొంత రాజకీయంతో ఎదుగుతా అంటూ కవిత జాగృతి నుంచి తెలంగాణ రక్షణ సేన వరకు ఎదిగారు.

అయితే ఈ ప్రయాణంలో కవిత తనకు రాజకీయ పునాది వేసిన తండ్రి కేసీఆర్ ని వదులుకోవడానికి ఇష్టపడ్డారు కానీ తానూ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన టిఆర్ఎస్ పేరును వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అంటే కవిత దృష్టిలో తెలంగాణ రాజకీయాలలో తన సొంత ఎదుగుదలకు కేసీఆర్ పేరు కంటే కూడా టిఆర్ఎస్ బ్రాండే ముఖ్యమని తేల్చేశారా.?

ADVERTISEMENT

బిఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తో బయటకొచ్చిన కవిత నాటి నుంచి కూడా బిఆర్ఎస్ నాయకుల మీద అవినీతి ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. హరీష్ రావు తో మొదలైన ఈ విమర్శనా బాణాలు అన్న కేటీఆర్ తో పాటుగా తండ్రి కేసీఆర్ ని తాకాయి.

కేసీఆర్ ని ఒక మరమనిషి అంటూ వ్యాఖ్యానించగలిగిన కవిత అదే కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పేరును మాత్రం వదలుకోలేకపోతున్నారు. మొదటగా బిఆర్ఎస్ రాకతో తెలంగాణ రాజకీయాలు నుంచి అస్తమించిన టిఆర్ఎస్ ను ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ గా తెలంగాణ రాజకీయాలలోకి తెచ్చిన కవిత ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’గా మార్చారు.

అయితే తాజాగా ఈసీ కి ఈ టిఆర్ఎస్ పేరు మీద కూడా అభ్యంతరాలు అందడంతో కవిత తన పార్టీ పేరును మార్చుకోవాలంటూ కవిత కు లేఖ రూపంలో సమాచారం అందించారు ఈసీ అధికారులు. అయితే దీని పై స్పందించిన కవిత ఇప్పటికే వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని టిఆర్ఎస్ పేరులో మార్పులు చేసి చివరికి తెలంగాణ రక్షణ సేనగా ప్రకటించామని,

ఇక ఆ పార్టీ పేరు మార్పు సాధ్యం కాదని, ఈసీ కోరినట్టుగా టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మరోకొత్త పేరు ఇచ్చేదిలేదని అవసరమైతే టిఆర్ఎస్ పేరు కోసం న్యాయపోరాటం చెయ్యడానికి కూడా సిద్ధమంటూ కవిత టిఆర్ఎస్ పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కట్టారు. అయితే కేసీఆర్ పేరు లేకుండా రాజకీయాలు చేసి తెలంగాణ రాజకీయాలలో సొంతంగా ఎదగగలను అని నమ్మిన కవిత టిఆర్ఎస్ పేరు పై ఎందుకింత పట్టుదలగా ఉన్నారు.?

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఐటీ మంత్రిగా తనదైన మార్క్ వేసిన కేటీఆర్ సైతం ఇప్పటికి తండ్రి చాటు బిడ్డ మాదిరి కేసీఆర్ పేరును తనకు కవచంగా వాడుకుంటూ రాజకీయం చేస్తున్నారు. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చినప్పుడు కూడా కేటీఆర్ టిఆర్ఎస్ పేరు మీద పట్టు పట్టలేదు. పార్టీ పేరు ఏదైనా కేసీఆర్ పేరే తమ రాజకీయ బ్రాండ్ అనేలా కేటీఆర్ ముందుకెళ్లారు.

కానీ కవిత మాత్రం టిఆర్ఎస్ పేరుతోనే తండ్రి కేసీఆర్ బిఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని భావిస్తున్నారు. కేసీఆర్ తన పార్టీ పేరును టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మార్చడంతోనే తెలంగాణలో కేసీఆర్ పతనం మొదలైందనే ప్రచారం తెలంగాణ రాజకీయాలలో బలంగా వినిపించింది.

అంటే ఎన్నికలలో ఒక పార్టీ గెలుపోటములను పార్టీ పేరు ప్రభావితం చేస్తుందా.? ఇప్పుడు ఆ ప్రభావాన్ని కవిత తన పొలిటికల్ మైలేజ్ కి ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారా.? అందుకే కేసీఆర్ పేరు కన్నా కూడా టిఆర్ఎస్ బ్రాండ్ కే కవిత విలువిస్తున్నారా.?

ADVERTISEMENT
Latest Stories