కేసీఆర్ మౌనం వీడెవరకే కవిత రాజకీయమా.?

Kavitha political future

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలు నుంచి బెయిలు మీద సొంత రాష్ట్రానికొచ్చిన కవిత తన రాజకీయాన్ని కొత్తగా మొదలు పెట్టిందనే చెప్పాలి. ఇన్నాళ్లు తండ్రి చాటు బిడ్డగా, అన్న వెనుక చెల్లిగా గులాబీ కారులో పయనించిన కవిత సొంత ఇమేజ్ కోసం ఆరాటపడుతున్నట్టుగా కనిపిస్తుంది.

చిలక జోస్యాల నుంచి అనుచరుల అరుపుల వరకు కవిత ‘సీఎం సీఎం’ అనే నినాదాలను తన నీడలా నడిపిస్తుంది. బిఆర్ఎస్ భవిష్యత్ నాయకుడు, కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అనేది దాదాపు ఖరారైన నేపథ్యంలో నేను కేసీఆర్ ను తప్ప మరెవ్వరిని నాయకుడిగా అంగీకరించను, నాకు కేసీఆరే బాస్ అంటూ కవిత వ్యాఖ్యానించడం కవిత రాజకీయ లక్ష్యాలను తెలియచేస్తున్నాయి.

ADVERTISEMENT

అలాగే మెడలో గులాబీ కండువాకు బదులు జాగృతి కండువా ప్రత్యక్షమవడం, తెలంగాణ భవన్ కు ప్రత్యామ్నాయంగా జాగృతి కార్యాలయం సిద్దమవడం, కేసీఆర్ సైన్యాన్ని వీడి జాగృతి దండును తయారుచేయడం కవిత సొంత కుంపటిని నిర్దారిస్తున్నాయి.

ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్ తో పోరాడడానికి, తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఉద్యమాలు చెయ్యడానికి జాగృతి సిద్ధం అనేలా బనకచర్ల ప్రాజెక్ట్ నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు కవిత యాక్టీవ్ గా ఉంటూ అటు అధికార పార్టీ ని నిలదీస్తూనే మరోపక్క ప్రతిపక్ష పార్టీలకు ప్రత్యామ్నాయంగా మారే ప్రయత్నాలు చేస్తుంది.

అయితే ఇదంతా కేసీఆర్ మౌనంగా ఉన్నంత వరకే అన్న సంగతి కవిత కు కూడా తెలిసిన విషయమే. ఈ లోపే తెలంగాణ రాజకీయాలలో తనతో పాటుగా జాగృతి కి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు సంపాధించాలి అనేది కవిత ముందున్న తక్షణ కర్తవ్యంగా చెప్పొచ్చు.

పార్టీ ఓటమి నుంచి నేటి వరకు రాజకీయాలలో చురుకైన పాత్రకు కాస్త బ్రేక్ ఇచ్చిన కేసీఆర్ ఒక్క సారి తన దూకుడు మొదలుపెడితే ముందుగా రాజకీయంగా దెబ్బ తినేది కవితే కావచ్చు. అటు కవిత తన లేఖలతో, పార్టీ నేతల మీద ఆరోపణలతో ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఉప్పందిస్తుంది .

ఆ ఉప్పే రేపటి రోజున కాంగ్రెస్ చేతిలో ఆయుధంగా మారే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ తన పార్టీ చుట్టూ జరుగుతున్న రాజకీయం తో పాటు పార్టీలో జరుగుతున్న అంతర్గత రాజకీయం మీద కూడా కవిత కు వ్యతిరేకంగా, కేటీఆర్ కు అనుకూలంగా ఒక్క ప్రకటన చేస్తే ఇక బిఆర్ఎస్ లో కవిత చాప్టర్ కు శుభం కార్డు పడ్డట్టే అవుతుంది.

కవిత కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ముందుకెళ్లి తెలంగాణ రాజకీయాలలో ఎదగలేరు. తొమ్మిదేళ్ల పాలనలో హైద్రాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టిన టీడీపీ ని సైతం కేసీఆర్ తన 9 నెలల ప్రభుత్వ రాజకీయంతోనే తెలంగాణలో సమాధి చేయగలిగారు. అలాంటిది కవిత రాజకీయం కేసీఆర్ ను బెదిరించగలుగుతుందా.?

జాగృతి కార్యక్రమాలు బిఆర్ఎస్ పార్టీని మరిపించగలుగుతాయా.? కవిత కేసీఆర్ నీడలో ఉన్నంత వరకే తెలంగాణలో ఉనికిలో ఉండగలుగుతుంది. ఒక్కసారి కేసీఆర్, కవిత రాజకీయం గురించి జాగృతి కార్యక్రమాల గురించి వ్యతిరేకంగా గళం విప్పితే కవిత అటు తండ్రిని విమర్శించలేక ఇటు అన్నతో కలిసి పని చేయలేక కుడితిలో పడ్డ ఎలక మాదిరి అల్లాడాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories