తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్టు పై తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. కాళేశ్వరం అవినీతి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, హరీష్ లను విచారణకు పిలుస్తుంది.
అలాగే కాళేశ్వరం అవకతవకల పై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ సైతం కేసీఆర్ ను బాధ్యుడిగా చూపిస్తూ తన నివేదికను రేవంత్ సర్కార్ కు అప్పగించింది. దీనితో అతి త్వరలో కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం అనే ఊహాగానాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి.
ఈ నేపథ్యంలో మీడియా మిత్రులు సీఎం రేవంత్ ను మీరు కేసీఆర్ ను జైలుకు పంపుతారా.? అంటూ ప్రశ్నించారు. దీనితో రేవంత్ నేనెందుకు కేసీఆర్ ను జైలుకు పంపుతాను అంటూ ఎదురు ప్రశ్నిస్తూ, ప్రస్తుతం కేసీఆర్ నివాసముంటున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి చర్లపల్లి జైలుకు పెద్ద తేడా ఏముంది అంటూ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ను ఎన్నికలలో ఓడించి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేయడమే ఆయనుకు పెద్ద శిక్ష. ఓటమి నుంచి నేటి వరకు కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టింది లేదు, అసెంబ్లీ గడప తొక్కింది లేదు. నాటి నుంచి నేటి వరకు కేవలం ఫేమ్ హౌస్ కి మాత్రమే పరిమితమైన కేసీఆర్ ను మళ్ళీ ప్రత్యేకంగా జాలికు పంపాలా.?
అటువంటి విద్వేష రాజకీయాలకు, కక్ష్య సాధింపు చర్యలకు తానూ ఎప్పుడు దూరంగా ఉంటానని రేవంత్ స్పష్టం చేసారు. దీనితో కాళేశ్వరం అంశంతో కేసీఆర్ జైలుకు వెళ్లడం పై తెలంగాణలో జరుగుతున్న చర్చకు తెరపడినట్లయ్యింది.
అయితే రేవంత్ జగన్ మాదిరి ముందు వెనుక ఆలోచించక కేసీఆర్ ను అరెస్టు చేస్తే అది బిఆర్ఎస్ పార్టీకి దొరికిన పెద్ద రాజకీయ అవకాశం అవుతుంది. వయస్సు రీత్యా కూడా కేసీఆర్ అరెస్టు ప్రజలలో సానుభూతిని సృష్టించి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయవచ్చు.
ఒక వేళ అదే జరిగితే తెలంగాణలో కూడా ఏపీ 2024 ఎన్నికలలో వైసీపీ కి వచ్చిన ఫలితాలే రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలే తెలంగాణ ప్రజలలో సెంటిమెంట్ ను రెచ్చకొట్టడంలో మాస్టర్ డిగ్రీ పొందిన కేసీఆర్ కుటుంబం, బిఆర్ఎస్ పార్టీ అంది వచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకోగలదు. అయితే రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఒకరకంగా బిఆర్ఎస్ కు నిరాశనే తెప్పించవచ్చు.
కాళేశ్వరంలో కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం దుందుడుకు చర్యలతో ముందుకు వెళితే ఏపీలో వైసీపీ మీద వచ్చిన వ్యతిరేకత మాదిరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తుందని, గతంలో బాబు కి దక్కిన మద్దతు మాదిరి దేశ రాజకీయాలలో కేసీఆర్ పేరు కూడా మారుమోగుతుందని ఆశించిన బిఆర్ఎస్ కు ఇది నిరాశే అనిచెప్పవచ్చు.






