తెలంగాణ సిఎం కేసీఆర్ తానొక మహా మేధావినని భావిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దరించిన తాను మాత్రమే దేశాన్ని ఉద్దరించగలనని, ప్రధాని పదవికి తనే తగినవాడినని గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్నారు.
దాంతో ఆయన ఒక దెబ్బకి రెండు పిట్టలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు. 1. తన సొంత రాజ్యంగా భావిస్తున్న తెలంగాణలో బిజెపి అధికారం చేజిక్కించుకోకుండా కాపాడుకొని తన రాజ్యానికి కుమారుడు కేటీఆర్‌ని ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయడం. 2. ప్రధాని కావాలనే తన కలని సాకారం చేసుకోవడం. దీనికే ఆయన గుణాత్మకమైన మార్పు, దేశాభివృద్ధి అంటూ మంచి కవరింగ్ ఇస్తున్నారని భావించవచ్చు. అయితే ఆయన కుటుంబంపైనే రాష్ట్రంలో ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేస్తున్నప్పుడు, కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నప్పుడు ఆయన దేశాన్ని ఉద్దరిస్తానని చెపుతుండతమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆయన ఏ కారణంతో జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్నప్పటికీ అనవసరం. కానీ రాష్ట్ర విభజనతో ఒకసారి, అప్పటి నుంచి నేటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దెబ్బ తీస్తూనే, ఏపీలో బిఆర్ఎస్ పార్టీని విస్తరించాలనుకోవడమే అభ్యంతరకరం. అయితే ఏపీలో రాజకీయ నిరుద్యోగులు చాలామందే ఉన్నారు కనుక భ్రష్టు పట్టిపోయిన ఏపీకి ఏకైక ఆశాకిరణం కేసీఆరే అని వారు చెప్పినట్లు సొంత మీడియా నమస్తే తెలంగాణలో ఈరోజు ప్రత్యేక కధనం ప్రచురించింది.
ఏపీలో బిఆర్ఎస్ పార్టీని స్థాపించేందుకు అనుమతించమని కోరుతూ ఏపీలో వివిదవర్గాలవారు కేసీఆర్ ఇంటి ముందు క్యూ కడుతున్నారని దానిలో పేర్కొంది. రెండు కులాల మద్య జరుగుతున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలిగిపోతోందని, వాటి నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించి తెలంగాణ రాష్ట్రంలాగ ఏపీని కూడా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రజలు కోరుకొంటున్నారని పేర్కొంది. దేశమంతా బిఆర్ఎస్ పార్టీని విస్తరిస్తున్నప్పుడు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు రావడం లేదని వారు అడుగుతున్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది. “అబ్‌కి బార్ కిసాన్ సర్కార్” అనే నినాదంతో కేసీఆర్ ఈసారి కేంద్రంలో రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడంతో ఏపీలో పల్లెపల్లెలో కేసీఆర్ గురించే చర్చించుకొంటున్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది. కనుక ఏపీకి కేసీఆరే దిక్కు అని తేల్చి చెప్పింది.
ఏపీలో కేసీఆర్‌కి తీవ్ర వ్యతిరేకత ఉందని వారికీ తెలుసు గనుక ఏపీలో బిఆర్ఎస్ అడుగుపెట్టడానికి బలమైన కారణాలు సిద్దం చేసుకొంటోందన్న మాట! ఏపీని ఇంతగా దెబ్బ తీస్తూనే కేసీఆర్ తాను ప్రధాని అయ్యేందుకు ఏపీ ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరాలనుకోవడం చూస్తే ఏపీ ప్రజలు తాను ఏది చెపితే అది నమ్మేసే వెర్రిబాగులవాళ్ళని భావిస్తున్నట్లుంది. ఆనాడు తమ అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకే ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. అటువంటిది దానికి కారకుడైన కేసీఆర్ వస్తే నెత్తిన పెట్టుకొంటారా? తెలంగాణ సంపదని దోచుకొనేందుకే వైఎస్ షర్మిల, చంద్రబాబు నాయుడు తమ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని వాదిస్తూ, ఏపీలో బిఆర్ఎస్ ప్రవేశించాలనుకోవడం, దానిని ఈవిదంగా గట్టిగా సమర్ధించుకోవడం కేసీఆర్‌కె చెల్లు!



