వైనాట్ 175, నమ్మకం, భవిష్యత్, సిద్దం, యుద్ధం, కలల గురించి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా తెలియనివారున్నారంటే ఆశ్చర్యకరమే. వీటితో జనాల చెవులు చిల్లులు పడిపోతున్నాయి… రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ పోస్టర్లు, ఫ్లెక్సీ బ్యానర్లే కనిపిస్తున్నాయి. తద్వారా రాష్ట్ర ప్రజలకు మళ్ళీ వైసీపియే గెలిచి అధికారంలోకి రాబోతోందనే అనుమానం కలిగించగలిగితే చాలు… అందరూ వైసీపికే బటన్ నొక్కేస్తారని భావిస్తున్నట్లుంది.
ఒక అబద్దాన్ని వందసార్లు గట్టిగా, నమ్మకంగా చెపితే చివరికి అదే నిజమైపోతుందనే ఫార్ములాని వైసీపి ఈవిదంగా తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుంది.
వైసీపి నేతలు సిద్దం సభలకు చుట్టుపక్కల జిల్లాల నుంచి జనాలను తీసుకువచ్చి కూర్చోబెడుతుంటే, వారి అధినేత ర్యాంప్ వాక్ చేస్తూ, ఆ వాపుని చూసి బలుపు అని మురిసిపోతున్నారు.
‘నయాన్నో భయాన్నో’ అంత మందిని తెచ్చి కూర్చోబెడుతున్నాము కనుక వారి ఓట్లన్నీ మనకే అనుకుంటే పర్వాలేదు. కానీ వారిని చూసి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వైసీపిని 175/25 సీట్లతో గెలిపించేయడానికి తహతహలాడిపోతున్నారని చెప్పుకోవడం ఆత్మవంచనే కదా?
‘వైనాట్ 175?’ అని జగన్ అంటుంటే, ‘5 సీట్స్ ఓన్లీ’ అని ఏబీపీ-సీ ఓటర్ సంస్థలు తేల్చిచెప్పేశాయి.
ఏపీలోని 25 లోక్‌సభ సీట్లలో టిడిపి, జనసేన, బీజేపీలకు 20 ఎంపీ సీట్లు, వైసీపికి కేవలం 5 సీట్లు మాత్రమే లభించే అవకాశం ఉందని అవి తేల్చి చెప్పేశాయి.
వీటిలో టిడిపి, జనసేనలకు కలిపి 17, బీజేపీ 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఏబీపీ-సీ ఓటర్ సంస్థలు చెప్పాయి.
న్యూస్ 18 అనే మరో ప్రముఖ మీడియా సంస్థ కూడా ఏపీలో సర్వే చేసి టిడిపి, జనసేన, బీజేపీల కూటమికి ఈసారి 18 సీట్లు వస్తాయని తెలియజేసింది.
ఈసర్వేలన్నీ అబద్దాలని అనుకున్నా, వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి మాటలు, మొహంలో కనిపిస్తున్న ఆందోళన, రాజధానిలో భూసేకరణ విషయంలో హడావుడి నిర్ణయాలు వంటివన్నీ చూసినా ఈ ఎన్నికలలో వైసీపి ఓడిపోబోతోందని అర్దమవుతోంది. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసని స్పష్టమవుతోంది.
ఇటీవల కేసీఆర్ పార్టీ నేతలతో మాట్లాడుతూ, “తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతోందనే విషయం తనకు రెండు వారాల ముందుగానే తెలుసని’ చెప్పారు.
ఇదేవిదంగా వైసీపి ఓడిపోబోతోందనే విషయం జగన్‌కు 5-6 నెలల ముందు నుంచే తెలిసి ఉన్నప్పటికీ, వైనాట్ 175?, సిద్ధం, చొక్కా మడత పెట్టి యుద్ధం అంటూ వైసీపి నేతలను, కార్యకర్తల కళ్ళకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చు. అదే బాగుందనుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ వైసీపి ఓటమి తప్పదనే సర్వేలతో మేల్కొంటే వారికే మంచిది.




