KCR Chandrababu Naidu

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ ఇద్దరూ హేమాహేమీలే. ఇద్దరూ అనేక ఆటుపోట్లు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినవారే. రాజకీయ వ్యూహాలలో వారికి వారే సాటి. కనుక ఇద్దరూ సరిసమానమేనని భావించవచ్చా? అంటే కాదనే చెప్పాలి. అందుకు అనేక కారణాలు కనబడుతున్నాయి.

కేసీఆర్‌ దాదాపు రెండున్నర దశాబ్ధాలు రాష్ట్ర రాజకీయాలను శాసించి, ఒక్క ఎన్నికలో ఓడిపోగానే చేతులెత్తేశారు. చంద్రబాబు నాయుడు జయాపజయాలను సమానంగా స్వీకరిస్తూ ఓటములను తట్టుకొని ఎదురొడ్డి నిలబడి పోరాడుతుంటారు.

Also Read – భారత్‌ దాడికి ముహూర్తం వాళ్ళే పెట్టేసుకున్నారే!

రాష్ట్ర విభజన, జగన్‌ పాలన వంటి విపరీత రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాలలో కూడా పార్టీ చెల్లాచెదురు అయిపోకుండా కాపాడుకున్నారు.

ఒక్కసారి ఎన్నికలలో ఓడిపోతేనే కేసీఆర్‌ తుంటి ఎముక విరగొట్టుకొని ఫామ్‌హౌస్‌లో పడుకున్నారు. కనుక ఆరోగ్యం విషయంలో కూడా కేసీఆర్‌ కంటే చంద్రబాబు నాయుడు చాలా బెటర్ అని చెప్పవచ్చు.

Also Read – పాక్‌పై దాడి అనివార్యమే.. ఆమోదం కోసమే కీలక సమావేశం?

కేసీఆర్‌ అధికారంలో లేకపోయినా ఎవరినీ కలవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా ఎటువంటి భేషజాలు, ఆర్భాటం లేకుండా సామాన్య ప్రజల ఇళ్ళకు వెళ్ళి వారితో మాట్లాడి సాధక బాధకాలు తెలుసుకుంటారు.

కూతురు కల్వకుంట్ల కవిత జైలుకి వెళిన్నప్పుడు, తనతో సహా కేటీఆర్‌, హరీష్ రావు తదితరులపై ప్రభుత్వం కేసులు నమోదు చేస్తున్నప్పుడు, ఫిరాయింపుల కారణంగా బిఆర్ఎస్ పార్టీ చాలా బలహీనపడి, పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం సన్నగిల్లినప్పుడు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు వచ్చి సింహంలా పోరాడుతారనుకుంటే, ఫామ్‌హౌస్‌లోనే ఉండిపోయి యాగాలు చేసుకుంటూ కాలక్షేపం చేశారు.

Also Read – వైసీపీ శవ రాజకీయాలకు వేళాయే!

ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు పోరాట యోధుడుగా మారి నిత్యం ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తల మద్య ఉంటూ మళ్ళీ బలం కూడగట్టుకుంటారు. పార్టీని కాపాడుకొంటూ, పార్టీ శ్రేణులకు, ప్రజలకు ధైర్యం చెపుతూ చాలా నిబ్బరంగా వ్యవహరిస్తుంటారు.

అధికారం కోల్పోయినా చంద్రబాబు నాయుడు శాసనసభ సమావేశాలకు హాజరయ్యేవారు. కానీ పదవీ, అధికారం ఉంటే తప్ప శాసనసభలో అడుగు పెట్టకూడదన్నట్లు కేసీఆర్‌ భీష్మించుకు కూర్చున్నారు.

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ కేసీఆర్‌ ప్రత్యేక విమానం వేసుకొని చేసిన హడావుడి అందరూ చూశారు. కానీ చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా పలుమార్లు జాతీయ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించారు. నేటికీ వ్యవహరిస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతూనే ఉన్నారు.

చంద్రబాబు నాయుడు అవసరమైతే కేంద్రంతో యుద్ధం చేస్తారు. అవసరమైతే ఓ మెట్టు దిగి పొత్తు కూడా పెట్టుకుంటారు. అందరినీ కలుపుకు వెళుతూ ప్రత్యర్ధులను చిత్తు చిత్తుగా ఓడిస్తుంటారు. కానీ నా అంతటి రాజకీయ మేధావి ఎవరూ లేరని అహంభావంతో విర్రవీగే కేసీఆర్‌ దేశంలో హేమాహేమీలైన నేతలందరూ తన నాయకత్వంలో పనిచేయాలని కోరుకొని దేశ రాజకీయాలలో ఒంటరిగా మిగిలిపోయారు.

చంద్రబాబు నాయుడు కేంద్రం సహాయ సహకారాలు పొందుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంటారు.

కానీ కేసీఆర్‌ అహంభావం, రాజకీయ దురాశ, రాజకీయ కారణాలతో కేంద్రం, ప్రధాని మోడీతో యుద్ధాలు చేస్తూ తాను, తన పార్టీ, తన రాష్ట్రాన్ని కూడా నష్టపరుచుకున్నారు.

కేసీఆర్‌ జగన్‌కు తోడ్పడి చంద్రబాబు నాయుడుని దెబ్బ తీస్తే, చంద్రబాబు నాయుడు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో టీడీపీ పోటీ చేయకుండా కేసీఆర్‌ని ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.

చివరిగా ఒక మాట: తమిళనాడులోని ద్రవిడ పార్టీల విధానాలను ఆదర్శంగా తీసుకోవాలని కేసీఆర్‌ చెపుతుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగన్‌ గొప్ప పోరాట యోధుడని కల్వకుంట్ల కవిత మెచ్చుకున్నారు.

కానీ నిజానికి కేసీఆర్‌తో సహా రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలన్నీ చంద్రబాబు నాయుడుని, ఆయన పోరాట స్పూర్తిని, ఆలోచనా విధానాలను స్పూర్తిగా తీసుకుంటే రాజకీయంగా రాణించవచ్చని పవన్ కళ్యాణ్‌ నిరూపించి చూపారు కదా?