ఆంధ్రపై నాకు ద్వేషం లేదు కానీ జగన్‌ గెలవాలి

KCR_Jagan

కేసీఆర్‌ టీవీ9 న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తెలంగాణ రాజకీయాలతో పాటు ఆంధ్ర రాజకీయాల ప్రస్తావన కూడా వచ్చింది. తనకు ఆంధ్రాపై ఎటువంటి ద్వేషమూ లేదన్నారు కేసీఆర్‌. ఆంధ్రా ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయడం లేదని కనుక ఏపీలో ఏ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినా తమకు తేడా ఉండదన్నారు. కానీ ఈసారి ఎన్నికలలో మళ్ళీ వైసీపి గెలిచి జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తనకు సమాచారం ఉందన్నారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ 100 సీట్లకు పైగా గెలుచుకోబోతోందని, తన వద్ద సమాచారం ఉందని కేసీఆర్‌ చెప్పేవారు. కానీ కేవలం 39 సీట్లు మాత్రమే రావడంతో ఎన్నికలలో ఓడిపోయింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో 17కి 3-4 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు చెపుతుంటే, 10-12 సీట్లు గెలుచుకోబోతున్నామని కేసీఆర్‌ మళ్ళీ జోస్యం చెపుతున్నారు.

ADVERTISEMENT

2014 ఎన్నికలలో ఏపీలో వైసీపి గెలిచి జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని కేసీఆర్‌ జోస్యం చెపితే టిడిపి గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. బహుశః అందుకేనేమో 2019 ఎన్నికలలో కేసీఆర్‌ జోస్యం చెప్పే బదులు వెనక నుంచి వైసీపికి సకల సహాయాలు అందించి జగన్మోహన్‌ రెడ్డిని గెలిపించుకున్నారు. మళ్ళీ ఈసారి కూడా గెలవాలని కోరుకొంటున్నారని కేసీఆర్‌ మనసులో మాట బయటపెట్టారు.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నెల రోజులు కూడా పూర్తికాక ముందే నానా విమర్శలు చేస్తూ, దానిని కూల్చేయాలని కేసీఆర్‌ తహతహలాడుతున్నారు. ఆంధ్రాపై తనకు ఎటువంటి ద్వేషమూ లేదని చెపుతూనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన జగన్మోహన్‌ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్‌ కోరుకోవడం చూస్తే నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తున్నట్లే ఉంది.

ఇది చంద్రబాబు నాయుడుపై పెంచుకొన్న ద్వేషమా లేక తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందకూడదనే దురాలోచనా?అంటే రెండూ అని చెప్పుకోవలసి వస్తుంది.

ఏపీ రాజకీయాలతో తమకు సంబందం లేదంటూనే ఈసారి ఎన్నికలలో మళ్ళీ వైసీపి గెలిచి జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని చెపుతూ ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయాలని కేసీఆర్‌ ఇంకా ప్రయత్నిస్తుండటం దురదృష్టకరం.

మా రాష్ట్రం, మా పార్టీ, మా కుటుంబం ఒక్కటే అభివృద్ధి చెందాలి కానీ ఇరుగు పొరుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందకూడదని కోరుకొనే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలకు ఎలా పనికి వస్తారు?రాజధాని లేని ఏపీని చూసి ప్రజలే బాధపడుతున్నారు. కానీ కేసీఆర్‌ మాత్రం అమరావతి వద్దంటున్న జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నారు… ఎందుకు?అయినా రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఇంకా ఆంధ్రాపై ద్వేషం దేనికి?

ADVERTISEMENT
Latest Stories