తెలంగాణలో తాజా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయం అయిపోయింది. ఒక మంచి ముహూర్తం చూసుకుని ఈటల ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద నాయకుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. అయితే ఒక హై డ్రామా మధ్య ఈటల తెరాస నుండి వెళ్లగొట్టారు.
ఒకానొక రోజున తెరాస అనుకూల మీడియాలో ఎవరో చెప్పినట్టుగా ఒకేసారి ఈటల మీద ముప్పేట దాడి చేశారు. కొందరు రైతులు ఈటల తమ భూములు కబ్జా చేశారని మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. ఆ వెంటనే నిముషాలలో కేసీఆర్ విచారణకు ఆదేశించారు. ఆ తరువాత గంటల వ్యవధిలో అధికారులు నివేదిక ఇచ్చి ఈటలని దోషిగా తేల్చారు.
వెంటనే ఈటలను కేబినెట్ నుండి తొలగించారు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఈటల నుండి ఈ తరహాలో పార్టీ నుండి వెళ్లగొట్టడం పార్టీ సమర్ధకులను కూడా విస్మయపరిచింది. అయితే తాజాగా తెరాసలో జరుగుతున్న చర్చ ప్రకారం ఇది పూర్తిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.
కేసీఆర్ కొంతకాలంగా ఈటల వివిధ సందర్భాలలో చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యల కారణంగా ముఖ్యమంత్రి గుర్రుగా ఉన్నారట. అయితే ఈటలను పార్టీ నుండి వెళ్లగొట్టడం తనయుడు కేటీఆర్ కు అసలు ఇష్టం లేదట. కేసీఆర్ ను నిలువరించడానికి కేటీఆర్ చివరి నిముషం వరకూ ప్రయత్నం చేశారట. అయితే కేసీఆర్ వినలేదట. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో శ్రమించిన ఈటలను పార్టీ నుండి వెళ్లగొడితే ప్రతిపక్షానికి మరీ ముఖ్యంగా బీజేపీ చేతికి అస్త్రం ఇచ్చినట్టే అని కేటీఆర్ అభిప్రాయమట. అయినా కేసీఆర్ మాట వినలేదు. చివరికి ఈ ఎపిసోడ్ ఎక్కడకు వెళ్తుందో చూడాలి.



