గతంలో ఎన్నడు లేని విధంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడ్డారు. తాము అధికారంలో లేనటువంటి రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను నిర్వీర్యం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలదోసి, తమ పార్టీ అధికారంలోకి రావడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదని విమర్శించారు.
కేంద్రంలో బక్వాస్ (పనికిమాలిన) సర్కార్ ఉందని.. ఆ ప్రభుత్వం చెప్పే వాటిల్లో 99 శాతం అబద్ధాలేనని విమర్శించారు. రాష్ట్రాలను అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలని కేంద్ర బీజేపీ సర్కారు చూస్తోందని.. తెలంగాణ కోసం చావునోట్లో తలపెట్టిన కేసీఆర్, వారికి లొంగుతాడా? అని ప్రశ్నించారు.
గతంలో ఎన్నడు కేసీఆర్ బీజేపీని ఇంతగా టార్గెట్ చెయ్యలేదు. బీజేపీ తెలంగాణలో బలపడుతుందని, నవంబర్ లో జరగనున్న దుబ్బాక ఉపఎన్నికలో ఆ పార్టీ నుండి గట్టి ముప్పు ఉండటంతోనే కేసీఆర్ కావాలని ఎదురుదాడికి దిగుతున్నారని కమలనాథులు ఆరోపిస్తున్నారు.
ఇటీవలే పార్లమెంట్ లో వ్యవసాయ, విద్యుత్తు సంస్కరణల బిల్లులకు కూడా తెరాస మద్దతు ఇవ్వలేదు… అంతే కాకుండా ప్రతిపక్ష పార్టీలను సంఘటితం చేసి నిరసన కూడా తెలిపింది. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసినా చంద్రబాబు నాయుడుకు ప్రజల మద్దతు లభించలేదు. ఇక కేసీఆర్ విషయంలో ఏం జరగబోతుంది అనేది చూడాలి.




