కేసీఆర్‌కి జాతిపిత బిరుదు ఎవరిచ్చారు?

Revanth Reddy questions KCR Jaatipita title in Telangana politics

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి ఓ ధర్మ సందేహం వచ్చింది. బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌కు ‘తెలంగాణ జాతిపిత’ అనే బిరుదు ఎవరిచ్చారు?అని.

హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమం మాట్లాడుతూ, “తెలంగాణ జాతిపిత అని వాళ్ళకు వాళ్ళే బిరుదులిచ్చేసుకుంటున్నారు. పార్టీ శ్రేణులతో జాతిపిత అని ప్రచారం చేయించుకుంటున్నారు. దేశ స్వాతంత్ర్యం కొరకు మహాత్మాగాంధీ పోరాడారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పదవీ అధికారం ఆశించలేదు.

ADVERTISEMENT

గాంధీజీ తన కుటుంబం కోసం ఒక్క రూపాయి వెనకేసుకోలేదు. సర్వస్వం త్యాగం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయన తూటాలకు బలైయ్యారు. అందువల్లే దేశ ప్రజలు ఆయనని జాతిపిత అని గౌరవిస్తున్నారు.

కానీ తెలంగాణ సాధించగానే కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయన కొడుకు, బంధువులు అందరికీ పదవులు దక్కాయి. పదేళ్ళ పాలనలో చేయకూడని అవినీతిపనులన్నీ చేశారు. ఒక్కొక్కరూ వేల కోట్ల ఆస్తులు, వందల ఎకరాలలో ఫామ్‌హౌసులు నిర్మించుకున్నారు. మీ అందరికీ ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పగలరా?

అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకున్న కేసీఆర్‌ తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు? అవినీతికి పాల్పడినందుకు పోలీసులు నోటీస్ ఇచ్చి విచారణ జరపడం తప్పెలా అవుతుంది? అయన అవినీతికి పాల్పడి కేసులలో చిక్కుకుంటే దానికి ప్రజలా బాధ్యులు? ఈ కేసుకి ప్రజల ఆత్మగౌరవానికి ఏం సంబంధం?

అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినా ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేయాలా? మీ అవినీతి పై విచారణ జరిపితే ‘జాతిపితకి అవమానం’ అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. అవినీతికి పాల్పడకపోతే విచారణ ఎదుర్కోవడానికి భయం దేనికి?” అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ జాతిపిత, దేశ్ కీ నేత, అపర చాణక్యుడు, అపర భగీరధుడు, రైతు బంధు… అంటూ పదేళ్ళపాటు తెలంగాణలో భజనలు సాగాయి. చిత్ర పటాలకు పాలాభిషేకాల ట్రెండ్ కూడా కేసీఆర్‌ హయంలోనే మొదలైంది. మన దేశంలో ఇలాంటి ‘భజనలు’ కొత్తేమీ కావు. ఇందిరా గాంధీ సమయం నుంచే ఉన్నాయి.

కానీ కేసీఆర్‌ హయంలో కొత్త ట్రెండ్స్ మొదలయ్యాయి. సిఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు కేసీఆర్‌ సూచన మేరకు లేదా పార్టీ పెద్దల సూచన మేరకు ఈ ‘సెల్ఫ్ ప్రమోషన్స్’ జోరుగా సాగాయి. అయితే యావత్ దేశాన్ని గెలిచేద్దామనుకున్న కేసీఆర్‌, ఎంతగా సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకున్నా తెలంగాణలోనే అట్టర్ ఫ్లాప్ అయ్యారు!

మనది వాపు కాదు బలుపు అని అప్పుడే గుర్తించి ఉండాలి. కానీ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు సీక్వెల్ తీస్తున్నట్లు, మళ్ళీ పాత కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లేతోనే మరోసారి అధికారంలోకి రాగలమని భ్రమింపజేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories