కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22కు గానూ ఈరోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాదిలో ఎన్నికలకు వెళ్లే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, త్రిపురకు వారలు కురిపించిన నిర్మలమ్మ రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రం మొండి చెయ్యి చూపించారు. విభజన హామీలు, కొత్త రైల్వే ప్రాజెక్టులు ఇలా ఏ విషయంలోనూ ఏపీ, తెలంగాణలను పట్టించుకున్న పాపాన పోలేదు.
అయితే బడ్జెట్ విషయం పై రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార పక్షాలు తెలివిగా స్పందించాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిఎప్పటిలానే మీడియా ముందుకు రాలేదు. అయితే ప్రజలకు ఏదో స్పందించాం అని చెప్పుకోవడం కోసం… నిరసన వ్యక్తం చేశాం అని మీడియాలో వేసుకోవడం కోసం మాత్రం విజయసాయి రెడ్డి తో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు.
బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని, ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదన్నారు విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ శ్రద్ధ ఏమాత్రం కనిపించలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా మీద వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి గానే కాడె వదిలేసింది. ఇప్పుడు ఆ అంశాన్ని స్పృశించడం పైన చెప్పినట్టుగా మీడియా, ప్రజలకోసం చెప్పినట్టు అయ్యింది.
ఇక తెలంగాణ విషయంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ రాష్ట్రంలో బలపడుతున్న తరుణంలో అక్కడి అధికార తెరాస కూడా ఆచితూచి స్పందిస్తుంది. వ్యవసాయ చట్టాల మొదలు ఇప్పటి బడ్జెట్ వరకు కేంద్రంలోని బీజేపీ నొచ్చుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. బహుశా అలా చేస్తే తెలంగాణలో బీజేపీ స్లో అవుతుందని కేసీఆర్ అంచనా ఏమో? కేసీఆర్ కు నామ్ కే వస్తే గా మిగతా నేతలతో ఖండనలు ఇప్పించడంతోనే సరిపెట్టనున్నారు.





