ఈ నెల 19 వ తేదీన కేసీఆర్ ఫామ్ హౌస్ గడప దాటి బయటకు రాబోతున్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించబోతున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని పార్టీ క్యాడర్ కి, లీడర్లకు పార్టీ భవిష్యత్ కార్యాచరణ పై పూర్తి స్పష్టత ఇవ్వబోతున్నారు.
సుదీర్ఘ కాలం తరువాత పార్టీ సమావేశాలలో పాల్గొనబోతున్న కేసీఆర్ ఇంతవరకు తన పార్టీ పై, తన పార్టీ నేతల పై ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలకు, సొంత కుమార్తె చేస్తున్న అవినీతి ఆరోపణలకు మీడియా ముఖంగా బదులు చెపుతారా.? వారికి తన స్టైల్ లో ధీటైన కౌంటర్ ఇస్తారా.? అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
అయితే గత కొంతకాలంగా బిఆర్ఎస్ టార్గెట్ గా కవిత నడుపుతున్న జాగృతి రాజకీయం నుంచి జనం బాట కార్యక్రమాల వరకు హరీష్ మొదలు మాధవరం వరకు కవిత అనేకమంది బిఆర్ఎస్ ప్రముఖ నేతల పై అవినీతి ఆరోపణలు చేసారు.
అలాగే తన జోలికొస్తే కాళ్ళు విరగకొడతా, మీ అవినీతి గుట్టు రట్టు చేస్తా అంటూ బెదిరింపు హెచ్చరికలకు సైతం వెనుకాడడం లేదు. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ బయటకొచ్చి తన పార్టీ విధానాల పై పార్టీ నేతల అవినీతి పై కవిత చేస్తున్న ఆరోపణలకు బదులు ఇస్తే దానికి కవిత కేసీఆర్ కి వ్యతిరేకంగా ఎదురెళ్లి తిరిగి కౌంటర్ ఇవ్వగలరా.?
ఇన్నాళ్లు కేసీఆర్ నీడన రాజకీయంగా ఎదిగిన కవిత ఇప్పుడు కన్న తండ్రికి వ్యతిరేకంగా పోరాడగలదా.? అందుకు కవిత కు తెలంగాణ ప్రజల నుండి మద్దతు లభిస్తుందా.? కేసీఆర్ ని కాదని తెలంగాణ సమాజం కవిత వెనుక నడవగలుగుతుందా.?
కేసీఆర్ మునపటి మాదిరిగా యాక్టీవ్ రాజకీయాలలోకి అడుగుపెడితే కవిత అజ్ఞాతంలో వెళ్లాల్సిందేనా.? కేసీఆర్ ని దాటుకుని కవిత తన రాజకీయ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతుందా.?
ఇన్నాళ్లు హరీష్ పేరు మీద సంతోష్ చర్యల మీద మల్లారెడ్డి అక్రమాల మీద మాధవరం అవినీతి మీద నోరు విప్పిన కవిత రేపటి రోజున కేసీఆర్ ఫామ్ హౌస్ రాజకీయాల మీద కూడా గళం విప్పగలుగుతుందా.?
అలాగే తన అరెస్టు సమయంలో కల్వకుంట్ల కుటుంబంలో నుంచి సాగిన నిశ్శబ్దతకు గల కారణాలను బయటపెట్టగలరా.? ఇన్నాళ్లు తెలంగాణ జాతిపిత అంటూ కేసీఆర్ ని కీర్తించిన కవిత నోరు ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి వివరిస్తుంది.
ఇక రేపటి రోజునా తానూ ఆశించే ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి కేసీఆర్ తో రాజకీయ యుద్ధం చెయ్యగలరా.? అన్న కేటీఆర్ తో తలపడగలరా.? ఇప్పటి వరకు కాళేశ్వరం అవినీతి మరకను హరీష్ కు మాత్రమే పరిమితం చేసిన కవిత ఇకముందు కూడా ఆ పరిమితికి కట్టుబడే ఉండగలరా.?
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో అన్నకు మద్దతు గా మాట్లాడిన కవిత ఫోన్ టాపింగ్ ఆరోపణలలో కేటీఆర్ కి అండగా నిలబడతారా.? ఇలా కవిత రాజకీయం మొత్తం కేసీఆర్ భవిష్యత్ ప్రణాళికల మీద, కేటీఆర్ ప్రస్తుత రాజకీయ వ్యూహాల మీద ఆధారపడి ముందుకెళ్ళాలసిందేనా.? కేసీఆర్ అజ్ఞాతం వీడితే కవిత రాజకీయం అయోమయమేనా.?






