ఓ సినిమా సూపర్ హిట్ అయితే ఇంచుమించు అలాంటి కధ, ఫార్ములాతో వరుసపెట్టి సినిమాలు వచ్చేస్తుంటాయి. వాటిలో కూడా ఒకటో రెండో హిట్ అవుతుంటాయి.
తెలంగాణ రాజకీయాలలో ఇలాంటి హిట్ ఫార్ములా ‘ప్రాంతీయవాదం’ సృష్టికర్త కేసీఆరే. ఈ ఫార్ములాతో అయన తెలంగాణ సాధించారు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఫార్ములాతోనే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని కేసీఆర్ ఆరాటపడుతున్నారు. కేటీఆర్ కూడా ఈ ఫార్ములానే నమ్ముకున్నారు.
జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ కూడా తెలంగాణలో మనుగడ కాపాడుకోవడం కోసం ఈ లోకల్ ఫార్ములాని అడాప్ట్ చేసుకోక తప్పడం లేదంటే ఇది ఎంత శక్తివంతమైన ఫార్ములాయో అర్థం చేసుకోవచ్చు.
చివరికి కేసీఆర్ సృష్టించిన ఈ ప్రాంతీయవాద ఫార్ములా గల్లీ స్థాయి లీడర్లకు కూడా రాజకీయ నాయకులుగా కొత్త గుర్తింపునిస్తోంది అంటే అతిశయోక్తి కాదు.
భగభగ మండుతున్న మంటలపై నీళ్ళు పోస్తే చప్పున చల్లారిపోయాయి. కానీ కానీ గమ్మతైన విషయం ఏమిటంటే, ఈ ఫార్ములాలో అది రివర్స్ అవుతుంది. ఈ మంట చల్లారిపోకుండా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ ఎప్పటికప్పుడు కృష్ణా జలాలతో తడుపుతూనే ఉన్నారు. అవి పెట్రోల్లా ఆ మంటలను మరింతగా రగిలిస్తూనే ఉన్నాయి.
తెలంగాణ రాజకీయాలలో ఒంటరి ప్రయాణం మొదలుపెట్టిన ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత, తండ్రి సృష్టించిన ఇంత సక్సస్ ఫుల్ ఫార్ములాని కాదని కొత్త ఫార్ములా కోసం దేవులాడుతారనుకోలేము. కనుక ఆమె కూడా కృష్ణా జలాలు మొదలు ట్యాంక్ బండ్ మీద ఆంధ్రా నాయకుల విగ్రహాల వరకు వాడేసుకుంటూనే ఉన్నారు.
ఈ ప్రాంతీయ ఫార్ములా ఓ ఊట బావి వంటిదే… తోడుకున్నవారికి తోడుకున్నంతా లభించవచ్చు. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు ఉద్దండులు ఈ ఫార్ములాతో తెలంగాణ రాజకీయాలు చేసి మైలేజ్ తీసుకుంటున్నప్పుడు, కవిత వారిని విమర్శిస్తూ ఈ ఫార్ములాతో మైలేజ్ పొందగలరా?అంటే అనుమానమే.
కేసీఆర్ ఒక్క చిటికేస్తే చాలు జాగృతి కండువాలు కప్పుకొని ఆమె వెనుక నిలబడి ఆమె చెప్పే మాటలకు తలలూపుతున్న వారందరూ పొలోమని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేయకుండా ఉంటారా? కేసీఆర్ నోరు విప్పి కూతురు కవితని పట్టించుకోవద్దని ఒక్క మాట చెప్తే చాలు జనం ఆమెను పట్టించుకుంటారా?
ఏదో రోజు ఆమె తండ్రి పంచన చేరడం ఖాయమని నేటికీ ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. కనుక రాజకీయ నాయకులకు ఉండాల్సిన బేసిక్ పాయింట్ ‘రాజకీయ విశ్వసనీయత’ లేనే లేదు. ఆమె రాజకీయ మనుగడే ప్రశ్నార్ధకంగా కనిపిస్తోంది.
కనుక ప్రాంతీయవాదం పేరుతో రాజకీయాలు కాలక్షేపానికి పనికి వస్తాయేమో కానీ రాణించడానికి పనికి రాకపోవచ్చు. అయినా రెండు బలమైన జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజేపిలు ఒకవైపు, తెలంగాణ ప్రాంతీయవాదంతో బీఆర్ఎస్ పార్టీ మరోవైపు నిలబడి కత్తులు దూసుకుంటుంటే, కవిత చాకు పట్టుకొని వాటితో యుద్ధం చేసి గెలవగలమని అనుకోవడం కొండకు వెంట్రుక ముడేసి లాగే ప్రయత్నమే.
కేసీఆర్‌కి తొడకొట్టి సవాలు విసిరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇలాగే దళిత ఓటు బ్యాంకుతో ఎన్నికలలో గేలిచేసి ఏనుగు ఎక్కి ప్రగతి భవన్ తలుపులు బద్దలు కొడతానని ప్రగల్భాలు పలికారు. కానీ చివరికి అదే కేసీఆర్ పంచన చేరి రాజకీయ కాలక్షేపం చేస్తున్నారు కదా? కవిత పరిస్థితి కూడా ఇదే కావచ్చు.
కానీ ఒకవేళ ఆమె తన అపారమైన శక్తి సామర్ధ్యాలతో, తెలివితేటలతో, ఈ ప్రాంతీయ ఫార్ములాతో ఈ మూడు పార్టీలను ఓడించేసి తెలంగాణ ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఆమెకు జేజేలు పలకాల్సిందే!






