తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ముందు మరోసారి బీజేపీకి అవకాశం ఇచ్చింది. అయోధ్యలో నిర్మించే రామాలయానికి చందాలివ్వొద్దని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు అయోధ్య రామాలయం పేరుతో బిచ్చమెత్తు కుంటున్నారన్నారు.
మన గ్రామాల్లో రాముడు లేడా… ఉత్తర ప్రదేశ్ లో రామాలయానికి చందాలెందుకు ఇవ్వాలని కామెంట్ చేశారు. బొట్టుపెట్టుకుంటేనే రామభక్తులా.. తాము కూడా శ్రీరాముని భక్తులమే అన్నారు ఎమ్మెల్యే విద్యాసాగర్. ఇది బీజేపీ వారికి ఆయుధంగా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలతో విరుచుకుపడింది.
ఈరోజు హైదరాబాద్ లో ఏకంగా కొందరు బీజేపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్ కాన్వాయ్ కి అడ్డుపడే ప్రయత్నం చేశారు. తెరాస హిందూ వ్యతిరేకి అంటూ పార్టీ నేతలందరూ కామెంట్లు చెయ్యడం మొదలుపెట్టారు. “శ్రీరాముడిని కాదునుకునే వాడు తెలంగాణా కి కానీ భారతదేశానికి కూడా కాని వాడే, రాముడిని వ్యతిరేకించేవారికి తెలంగాణా లో పుట్టగతులుండవు,” అని సీనియర్ నేత మురళీధర రావు అన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై సీఎం కేసీఆర్ వైఖరి స్పష్టం చేయాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. విద్యాసాగర్‌రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే ప్రజలే తిరగబడతారని బండి సంజయ్ హెచ్చరించారు. అనవసరంగా తెరాస బీజేపీకి అవకాశం ఇచ్చినట్టు అయ్యింది. ఎన్నికల వరకు ఈ విషయాన్నీ వాడుకుని సెంటిమెంట్ రగిలిస్తారు.





