పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన కొత్త ప్రాజెక్టు పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. సుప్రీం కోర్టు తలుపు తట్టడానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే కృష్ణా బోర్డుకు కంప్లైంట్ చేసింది. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే అని బోర్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది.
ఈ మొత్తం ఉదంతం చదివిన వారికి ఇది జగన్… కేసీఆర్ల ప్రభుత్వాల మధ్య విషయం అని స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని అధికారపార్టీ నేతలు కేసీఆర్ ని ఏమీ అన్నారు… దీనిలో కూడా చంద్రబాబునే ఎటాక్ చేస్తారు. ఎన్నికల ముందు కేసీఆర్, చంద్రబాబులు కత్తులు దూసుకున్నారు. అయినా చంద్రబాబుని నిందించడం ఏంటో ఎవరికీ అర్ధం కాదు.
“ఇతర పార్టీల్లోకి తను పంపించిన బానిసల గొలుసులు విప్పి పోతిరెడ్డపాడు జిఓపై ఉసిగొల్పుతున్నాడు చంద్రబాబు. వాళ్లెంత మొరిగినా న్యాయం అనేది ఒకటుంటుంది. ఏపీ తన కేటాయింపులకు మించి చుక్క నీటిని కూడా అక్రమంగా తీసుకోదని సిఎం జగన్ గారు స్పష్టం చేశారు. మౌనీ బాబా నోరు విప్పాలి,” అంటూ ట్వీట్ చేశారు ఆ పార్టీ నెంబర్ టూ విజయసాయి రెడ్డి.
చంద్రబాబు బానిసలు ఏ పార్టీలో ఉన్నా ఇప్పుడు ఇబ్బంది కేసీఆర్ తో కదా? కేసీఆర్ జగన్ దోస్తులు అన్న విషయం అందరికీ తెలిసిందే. తాము వ్యతిరేకంగా దీక్ష చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ కు కూడా వెళ్లొచ్చే అంతటి గాఢ స్నేహం. జగన్ గారు స్పష్టం చెయ్యాల్సినది కేసీఆర్ కు. ఆయనను ఒప్పించి కొత్త ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగించుకోవాలి. ఈ మొత్తం విషయంలో ఏపీలో 23 సీట్లు, తెలంగాణలో ఒకే ఒక్క సీటు ఉన్న చంద్రబాబు చేసేది ఏముంటుంది?





