కేసీఆర్‌ రిలీజ్ డేట్ 2025లోనేనట!

BRS KCR

కొన్నిసార్లు సినిమాలు వివిద కారణాల వలన వాయిదా పడుతుంటాయి. సినిమా అనేది కోట్ల రూపాయలతో కూడుకున్న ఆర్ధిక వ్యవహారం. కనుక సినిమా విడుదల చేసేటప్పుడు అన్నీ సరిచూసుకున్నాకనే విడుదల చేస్తుంటారు. ఇది చాలా అవసరం కూడా.

ADVERTISEMENT

కానీ ఎప్పటి నుంచో రాజకీయాలలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ ఎన్నికలలో ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఫామ్‌హౌస్‌లో ఉండిపోతే, ఏదో రోజు ఆయన తప్పకుండా బయటకు వస్తారని ప్రజలు ఎదురుచూడటం సహజం. కానీ రావడం లేదు!

శాసనసభ సమావేశాలకు తప్పకుండా వస్తారని బిఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు కానీ రాలేదు! ఎందుకు రాలేదని సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు అడిగితే సమాధానం చెప్పలేదు!డిసెంబర్‌లో వస్తారని కొత్త ముహూర్తం ప్రకటించారు. కానీ తాజాగా కేటిఆర్‌ మరో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.

ఎక్స్ వేదికగా ‘ఆస్క్ కేటీఆర్‌’ పేరుతో నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో కేసీఆర్‌ గురించి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్‌ ‘కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన మార్గదర్శకత్వంలోనే మేమందరం పనిచేస్తున్నాము. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే మౌనంగా ఉన్నారు. 2025 నుంచి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటారు,” అంటూ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్‌ సమయం ఇవ్వాలనుకుంటునప్పుడు, కేటీఆర్‌, హరీష్ రావు తదితరులు ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు? రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఒక్కో హామీ అమలు చేస్తున్నా చేయడం లేదంటూ ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు?

కేసీఆర్‌ తమకు ప్రతీరోజూ అవసరమైన సలహాలు ఇస్తూ మార్గదర్శనం చేస్తున్నారని కేటీఆర్‌ చెప్పుకున్నారు. అంటే ఆయన సూచనల మేరకే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంతో యుద్ధాలు చేస్తున్నారని స్పష్టం అవుతోంది కదా?

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో కూర్చొని కేటీఆర్‌, హరీష్ రావుల చేత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై యుద్ధాలు చేయించేబదులు ఆ యుద్ధాలు ఆయనే స్వయంగా చేయవచ్చు కదా?తద్వారా బిఆర్ఎస్ శ్రేణులకి కూడా ధైర్యం కలుగుతుంది కదా?

కేసీఆర్‌ ఒకవేళ రాజకీయాలు చేయకూడదని అనుకుంటే కనీసం ప్రతీరోజూ తెలంగాణ భవన్‌కి పార్టీ శ్రేణులతో మాట్లాడవచ్చు కదా?అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

కానీ ఈవిదంగా కొత్త సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినట్లు ఎప్పటికప్పుడు ఫామ్‌హౌస్‌ నుంచి కేసీఆర్‌ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తుంటే, ఆయన బయటకు రాకుండా లోపలే కూర్చుంటే నవ్వులపాలయ్యేది కేటీఆర్‌, హరీష్ రావులే!

కేసీఆర్‌ రాజకీయ వైఖరి, వ్యూహాలు ఏవీ ఫలించడం లేదు. అన్నీ బెడిసి కొడుతున్నాయి. కనుక కేటీఆర్‌, హరీష్ రావులే ఆయనని బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కనుక కేసీఆర్‌ని ఎంత త్వరగా బయటకు తీసుకువస్తే అంతా వారికే మంచిది.

ADVERTISEMENT
Latest Stories