సంక్రాంతికి విడుదల కాబోతున్న మూడు సినిమాలు సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబవుతున్నాయి. అయితే ‘చిరు వర్సెస్ బాలయ్య’ ఎపిసోడ్ గా మారిన ఈ సంక్రాంతి రేసులో సెన్సార్ టాక్ ప్రకారం ఏ చిత్రం బలంగా ఉంది? అన్న టాక్ సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. రెండు సినిమాలు కూడా సెన్సార్ బోర్డు నుండి ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను పొందాయి గానీ, కమర్షియల్ కోణంలో మాత్రం రెండు సినిమాలకు భిన్నమైన స్పందనలు వచ్చినట్లుగా తెలుస్తోంది.
విమర్శకుల ప్రశంసలు అందుకునే చిత్రంగా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” నిలుస్తుందని సమాచారం. ఇంటర్వెల్ బ్యాంగ్, బాలయ్య డైలాగ్స్, యుద్ధ సన్నివేశాలు, లొకేషన్స్, క్రిష్ దర్శకత్వం హైలైట్స్ గా వినపడుతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ విషయంలో మాత్రం అసంతృప్తి వినపడుతోంది. అలాగే మొత్తమ్మీద ‘యావరేజ్’ నుండి ‘ఎబోవ్ యావరేజ్’గా నిలుస్తుందన్న అంచనాలు సెన్సార్ టాక్ గా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” సినిమా సెన్సార్ టాక్ వినపడుతోంది. విమర్శకుల ప్రశంసలు అందుకోకపోయినా, ప్రేక్షకులకు కావల్సినంత మసాలా ఎలిమెంట్స్ తో కమర్షియల్ సక్సెస్ అందుకునే విధంగా ‘ఖైదీ నంబర్ 150’ సెన్సార్ టాక్ ఉందన్న విషయం ఇప్పటికే తెలిసింది. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సెన్సార్ టాక్ విషయంలో అయితే మెగాస్టార్ దే పైచేయిగా కనపడుతున్నా, సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేసరికి ఏమవుతుందో చూడాలి.
ఎందుకంటే… గతంలో ఇలాగే ‘సెన్సార్ టాక్’ విషయంలో బంపర్, సూపర్ అన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కాబోర్లాపడ్డాయి. అందుకు ప్రధాన ఉదాహరణలే ‘సర్ధార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, కబాలి’ సినిమాలు. అంతేగాక, ప్రతి పెద్ద సినిమా సెన్సార్ పూర్తయిన వెంటనే, ఇలా ‘పాజిటివ్’ సెన్సార్ టాక్ లు వెలువడడం, ఆ తర్వాత సినిమా చూసిన తర్వాత భంగపాటుకు గురికావడం… షరామామూలుగా జరుగుతున్నాయి. అయితే ‘సెన్సార్ టాక్’లు ఎలా ఉన్నా… ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న రెండు పెద్ద సినిమాలతో పాటు ‘శతమానం భవతి’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను రాబట్టాలని ఆశిద్దాం.



