ఒక నాయకుడిని అభిమానిస్తున్నాము అంటే మరో నాయకుడిని కించపర్చాల్సిన అవసరం లేదు అనే కనీస సృహ లేకుండా ప్రవర్తిస్తుంటారు వైసీపీ నేతలు, ఆ పార్టీ కి చెందిన మద్దతుదారులు. కొడాలి నాని, పేర్ని నాని, రోజా, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్నాధ్, ముద్రగడ, పోసాని…ఇలా మరికొందరు ఈ కోవకు చెందిన వారిగానే గుర్తింపు పొందారు.
అయితే వీరి దృష్టిలో జగన్ కు, వైసీపీ కి తప్ప మరెవరికైనా తమ మద్దతు తెలియ చేసినా, వారికి అనుకూలంగా రెండు ముక్కలు మాట్లాడిన వైసీపీ నేతలు గుంపుగా వచ్చి సింగల్ వ్యక్తి మీద మాటల దాడి చేస్తారు. మరి …. లే గుంపుగా వస్తాయి అని చెప్పుకునే ఈ సో కాల్డ్ వైసీపీ నేతలు ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి మరి అదే …. గా గుంపుగా ఎందుకు వస్తారో..? చంద్రబాబు, పవన్, లోకేష్ పై ఒక్కోసారి వీరు చేసే విమర్శలు చూస్తే వారి అభిమానుల ఆవేశం కట్టలు తెంపుకునేలా ఉంటాయి.
రాజకీయాలలో ఈ స్థాయి వరకు దిగజారగలరా అనే అనుమానాలు వచ్చే స్థాయికి వైసీపీ నేతలు దిగజారిపోయారనే చెప్పాలి. వీరి నోటికి అడ్డుకట్ట వేసే నేతలే టీడీపీ, జనసేనలో కరువయ్యారా అంటూ ఆ పార్టీ మద్దతుదారులు ఆవేశంగా ఎదురుచూస్తున్న ఈ తరుణంలో ఒక్కడున్నాడు అంటూ అనూహ్యంగా మీడియా ముందుకొచ్చారు జబర్దస్త్ కమీడియాన్ కిర్రాక్ ఆర్పీ. పవన్ గెలుపు కోసం తమవంతు బాధ్యతగా అభిమానంతో పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జబర్దస్త్ షో నటీనటులను ఉద్దేశించి జబర్ధస్త్ జడ్జ్ గా చేసిన రోజా కొన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసారు.
వారెంత చిన్న ప్రాణాలు, చిన్న చిన్న ఆర్టిస్టులు అంటూ ఎద్దేవా చేసారు రోజా. అయితే రోజా వ్యాఖ్యలకు హర్ట్ అయిన కిరాక్ ఆర్పీ అనూహ్యంగా రోజా మీద విమర్శలతో రెచ్చిపోయారు. వైసీపీ తరుపున ఓడిపోబోయే మొదటి నియోజకవర్గం రోజాదే, ఆమెకు కనీసం డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదు అంటూ రోజా భాషలోనే ఆమెకు బదులిచ్చారు ఆర్పీ. అలాగే జగన్ కోసం తన సొంత ఇండస్ట్రీ వారినే అవమానించడానికి సిద్ధపడ్డ పోసాని ని టార్గెట్ చేస్తూ వైసీపీ అధికారిక భాషలోనే వారికి జవాబిచ్చారు ఆర్పీ.
జగన్ ను సింహం అంటూ పోలుస్తున్న వైకాపా నాయకులను ఉద్దేశించి సింహం ఎక్కడైనా ఇసుక, మద్యం, మైనింగ్ తింటుందా..? అంటూ కౌంటర్ వేశారు. అలాగే పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్న చిరంజీవి గారిని విమర్శించే స్థాయికి పోసాని వచ్చాడంటే ఆయన ఏ స్థాయికి దిగజారాడో అర్ధమవుతుందన్నారు. ఎంతో మంది అభిమానించే తమ స్టార్ హీరోలను తన ఇంటికి పిలిపించుకుని అవమానించిన జగన్ కు ఆ హీరోల అభిమానుల ఓట్లు ఎట్లా వేస్తారు అంటూ నిలదీశారు.
కేవలం జగన్ ఆనందం కోసమే టాలీవుడ్ సూపర్ స్టార్స్ మెగాస్టార్, సూపర్ స్టార్, రెబల్ స్టార్ వంటి అగ్ర హీరోలను, పాన్ ఇండియా స్థాయి దర్శకుడు రాజమౌళి వంటి ఇండస్ట్రీ పెద్దలను జగన్ దగ్గరకు తీసుకెళ్లి అవమానించిన పోసాని, పేర్ని నానికి బుద్ది చెప్పే రోజు వచ్చింది. మీ ఓటుతో వైసీపీ అహంకారాన్ని అణిచి వేయాలి అంటూ చేసిన ఆర్పీ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనితో వైసీపీ నేతలకు వారి భాషలోనే సమాధానం చెప్పే సరైనోడు వచ్చాడు అంటూ టీడీపీ, జనసేన మద్దతుదారులు ఈ వీడియో లను షేర్ చేస్తున్నారు.




