రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత ఒక్కసారిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని విమర్శించి, ప్రజల్లో ఎంతో కొంత పేరు సంపాదించుకున్న ‘సమైక్య ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి’ కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తను స్థాపించిన ‘జై సమైఖ్యాంధ్ర’ పార్టీ నుండి సొంత సోదరుడిని కూడా గెలిపించుకోలేక పోవడంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత నుండి ‘మౌనం’ వహిస్తూ వచ్చారు.
అయితే, చాలా కాలం తర్వాత అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తూర్పు గోదావరి జిల్లాకు విచ్చేసారు ఏపీ ‘సమైఖ్యాంధ్ర’ హీరో. హర్షకుమార్ ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ విద్యా సంస్థల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి, ఈ సందర్భంగా ఏపీలోని ప్రధాన సమస్య పట్ల స్పందించారు.
“ఏపీకి జరగాల్సిన నష్టం విభజనతోనే జరిగిపోయిందని, నీటి సమస్య తలెత్తుతుందని తానూ ముందే చెప్పానని అన్నారు. అలాగే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, చాలా విషయాలు మాట్లాడాలని ఉందని, సమయం వచ్చినపుడు అన్నింటిపై నోరు విప్పుతానని” చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి, తన పొలిటికల్ రీ ఎంట్రీ గురించి కూడా స్పందించారు.
“తన రాజకీయ ప్రస్థానం గురించి, మాట్లాడాల్సిన సమయం ఇది కాదని, దీనిపై మరో సందర్భంలో వివరిస్తానని” కిరణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రీ ఎంట్రీని ఖరారు చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘రీ ఎంట్రీ వార్తలపై స్పందించాల్సిన సమయం ఇది కాదు’ అని మాత్రమే చెప్పారు గానీ, సదరు వార్తలను ఖండించక పోవడం అనేది, ఆయన పొలిటికల్ ఎంట్రీకి ‘డోర్లు’ ఓపెన్ చేసే ఉన్నాయని చెప్పడానికి ఊతమిచ్చే అంశమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి గత కొంత కాలంగా కిరణ్ రీ ఎంట్రీ బిజెపిలోకి ఉంటుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చివరికి ఏ పార్టీ జెండా పట్టుకుంటారో చూడాలి.





