కొత్త ఏడాదిని పురస్కరించుకుని సంపూర్ణేష్ బాబు ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటివరకు తను ఏం చేసి ప్రేక్షకుల ఆదరణను పొందాడో, దానికే సంపూ దూరం కానున్నాడు. “ఇక నుండి ఎలాంటి స్పూఫ్ లు చేయను, ఓ నటులను అనుకరించాను” అంటూ అభిమానుల గుండెల్లో బాంబు పేల్చాడు. 2016 నూతన సంవత్సరం సందర్భంగా తానూ తీసుకున్న కొత్త నిర్ణయం ఇదంటూ ట్వీట్ చేసాడు సంపూ.
ప్రస్తుతం తానూ నటిస్తున్న “కొబ్బరిమట్ట” చిత్రం కూడా పూర్తి స్థాయి కుటుంబ కధా చిత్రమని, ఇతర చిత్రాలను గానీ, నటులను గానీ అనుకరించలేదని ప్రకటిస్తూ, “కొబ్బరిమట్ట”కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసాడు. దీంతో సంపూ ఫస్ట్ లుక్ సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆరు అడుగుల ఆజానుభాహుడు… శత్రువుల గుండెల్లో యముడు… ఈ “పాపారాయుడు” అంటూ సంపూ బాడీ చూపిస్తూ ఇచ్చిన లుక్ చింపేసింది.
‘హృదయ కాలేయం, ఈ రోజుల్లో’ చిత్రాల సభ్యులు కలిసి ఈ “కొబ్బరిమట్ట”కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. గుడ్ సినిమా గ్రూప్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించగా, స్టీవెన్ శంకర్ కధ, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.





