రాష్ట్రంలో చెత్తపన్ను విధింపుపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నప్పటికీ వాలంటీర్ల ద్వారా ప్రజలపై ఒత్తిడి చేస్తూ బలవంతంగా పన్ను వసూలు చేస్తోంది జగన్ ప్రభుత్వం. చెత్త పన్ను పేరు చెప్పి డబ్బులు పిండుకోవాలనుకోవడం చాలా చెత్త ఆలోచన అని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి ఓ పదో ఇరవయ్యో అయితే ఇవ్వగలరు కానీ ఏకంగా రూ.120 వసూలు చేస్తుండటంపైనే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని మంగళవారం గుడివాడ పట్టణంలో గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చెత్తపన్ను గురించే చాలా పిర్యాదులు వచ్చాయి. నెలకు రూ.90 చెత్తపన్ను చెల్లించడం తమకు భారంగా మారిందని సామాన్య, మద్యతరగతి ప్రజలు కొడాలి నానికి మొరపెట్టుకొన్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్ళలో ఉండేవారు ఇంటి అద్దె, కరెంటు బిల్లు కాకుండా ఈ చెత్తపన్ను కూడా కట్టాల్సివస్తుండటం తమకు భారంగా మారిందని మొర పెట్టుకొన్నారు.
కొడాలి నాని వెంటనే మున్సిపల్ కమీషనరును పిలిపించి ఇక నుంచి చెత్తపన్ను వసూలు చేయవద్దని ఆదేశించారు. నెలకు రూ.14 లక్షల చెత్తపన్ను వసూలుతో గుడివాడ పట్టణం రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని కమీషనర్ చెప్పగా కొడాలి నాని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఈ మాత్రం దానికి ప్రజలపై భారం వేయడం ఎందుకు? చెత్తపన్ను వసూలు చేయడం నిలిపివేయండి,” అని ఆదేశించారు. అక్కడి నుంచే బందరు ఎమ్మెల్యే పేర్ని నానికి ఫోన్ చేసి చెత్తపన్ను గురించి సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడేందుకు రావాలని కోరారు.
రాష్ట్రంలో వివిద నియోజకవర్గాలలో కూడా చెత్తపన్ను వసూలుపై ప్రజలు పిర్యాదులు చేస్తుండటం, ప్రజా ప్రతినిధులు అధికారులను పిలిచి చెత్త పన్ను వసూలు నిలిపివేయాలని ఆదేశిస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. చెత్తపన్ను విధింపు పరమ చెత్త ఆలోచనే అని ఇప్పుడు కొడాలి నానికి కూడా అర్దమైంది. కనుక ఈవిషయం సిఎం జగన్మోహన్ రెడ్డికి కూడా అర్దమైతే చాలు.