సహజత్వానికి దగ్గరగా వైసీపీలో ఉన్న నాయకులు అస్సలు ఆలోచించారా? అధినేత జగన్ మొదలుకుని నేతలు, కార్యకర్తలు అంతా ఊహాలలోనే తేలుతారా? కార్యకర్తల సంగతి ఏమో గానీ, పార్టీ అధినేత జగన్ మరియు ఆ పార్టీ నేతలు మాత్రం సమకాలీన పరిస్థితులకు విరుద్ధంగా ఆలోచనలు చేస్తున్నారన్న విషయం అర్ధమవుతోంది. ‘కాబోయే కాలానికి రాబోయే ముఖ్యమంత్రిని నేనే” అంటూ గత కొన్ని సంవత్సరాలుగా జగన్ ఊహాలలో తేలియాడుతుండగా, తాజాగా ఇదే జాబితాలోకి సదరు పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా చేరిపోయారు అనే సంకేతాలను పొలిటికల్ వర్గాలు వ్యక్తపరుస్తున్నాయి.
ఇటీవల కొడాలి నాని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. కుప్పంలో చంద్రబాబును, పులివెందులలో జగన్ ను, సిద్ధిపేటలో హరీష్ ను, గుడివాడలో నన్ను ఓడించే మగాడు లేడు, ఈ నాలుగు చోట్ల ఎప్పటికైనా, ఎన్నేళ్ళైనా మేమే గెలుస్తాం… అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపాయి. గుడివాడలో కొడాలి నాని భవిష్యత్తులో గెలుస్తారా? లేదా? అనేది రాబోయే ఎన్నికలలో తేలుతుంది గానీ, చంద్రబాబు, జగన్, హరీష్ రావులతో పోల్చుకోవడమే ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. బహుశా ఈ వ్యాఖ్యలు జగన్ కు కూడా రుచించకపోవచ్చు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతో తనకు తాను పోల్చుకోవడం అంటే, వైసీపీ తరపున సిఎం హోదాలో కొడాలి నానికి అవకాశం దక్కనుందా? జగన్ జైలుకు వెళితే గానీ లేదా పార్టీలో జగన్ తర్వాత స్థానంలో గానీ ఉండాలని కొడాలి భావిస్తున్నారా? అనే ప్రశ్నలను ఈ వ్యాఖ్యలు రేకెత్తిస్తున్నాయి. చంద్రబాబు ఎలాగూ ముఖ్యమంత్రి కాగా, జగన్ కూడా ‘సిఎం’ అంటూ ఊగిపోతున్న వైనం తెలిసిందే. ఇక కేసీఆర్ తర్వాత పార్టీని చేజిక్కించుకునే వ్యక్తిగా హరీష్ పేరు పొలిటికల్ వర్గాలకు సుపరిచితమే. వాళ్ళతో పోల్చుకోవడం అంటే…. నిజంగా జగన్ తదుపరి స్థానం తనదే అని ప్రజలకు, పార్టీకి చెప్పడానికే ఈ వ్యాఖ్యలు చేసారా?
నిజానికి కొడాలి నాని స్థాయికి ముఖ్యమంత్రి పీఠం అనేది ఊహించలేం. అయితే అసభ్య పదజాలాన్ని వినియోగించడంలో మాత్రం కొడాలి నానిది ముఖ్యమంత్రే కాదు, ప్రధానమంత్రి రేంజ్ అన్న విషయం బహిరంగమే. ఇక పార్టీ పరంగా వైసీపీ రోజు రోజుకు డౌన్ అవుతున్న తీరు గమనిస్తే… గతంలో జగన్ మెజారిటీలో చాలా వ్యత్యాసం వచ్చింది. రాబోయే కాలంలో ఇది మరింత దిగజారే అవకాశాలే కనపడుతున్నాయి తప్ప, పార్టీ పరంగా వైసీపీ బలపడే ఛాయలు అయితే కనిపించడం లేదు.


