కోమటిరెడ్డి vs రేవంత్ రెడ్డి.?

Komatireddy Venkat Reddy vs Revanth Reddy

తెలంగాణ రాజకీయాలలో సొంత పార్టీల ఇంటి పోరుతో కాంగ్రెస్, సొంత కుటుంబ సభ్యుల పోరాటంతో బిఆర్ఎస్, పార్టీ లో అంతర్గత ఆధిపత్యంతో బీజేపీ వార్తలలో నిలుస్తుంది. తాజాగా జీవన్ రెడ్డి వివాదం కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేస్తుండగా, ఇప్పుడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో కాకా రేపుతోంది.

సినీ పరిశ్రమ కోసం తెలంగాణ రాష్ట్రం తరుపున రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకులకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరు కావడంతో తెలంగాణ రాజకీయాలలో మొదలైన ఈ చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.

ADVERTISEMENT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి కోమటిరెడ్డి కి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా.? అందులో భాగంగానే తన శాఖకు సంబంధించిన ముఖ్య కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొనలేదా.? గతంలో కూడా సినీ కార్మికుల సభకు కూడా ముఖ్యఅథితిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ప్రాతినిధ్యం వహించారు కానీ సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటరెడ్డి ఎక్కడ కనిపించలేదు.

అలాగే సినిమా టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో కూడా సినీ పరిశ్రమ పెద్దలెవ్వరు తనను సంప్రదించలేదని, మంత్రిగా తన ఆమోద ముద్ర లేకుండానే టిక్కెట్ రేట్ల హైక్ తంతు జరిగిపోతుందని మంత్రి కోమటరెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో కూడా మంత్రిగా కోమటిరెడ్డి ప్రజన్స్ లేకపోవడంతో అసలు కాంగ్రెస్ పార్టీలో ఎం జరుగుతుంది.? కథ మళ్ళీ మొదటికొచ్చిందా.? కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత కుమ్ములాటలు బహిర్గతం అయ్యేందుకు వేళాయిందా.? అంటూ చర్చలు మొదలయ్యాయి.

ఒకపక్క జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా అంటూ ప్రకటించడం, మరోపక్క మంత్రి కోమటిరెడ్డి తన శాఖ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, ఇంకోపక్క కోమటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి కావాలంటూ పట్టుబట్టడం వంటి వరుస వివాదాల మధ్య రేవంత్ సర్కార్ ప్రత్యర్థి పార్టీలకు మంచి ఆహారాన్ని అందిస్తుందనే చెప్పాలి.

అయితే జీవన్ రెడ్డి అలక వెనుక అనేక కారణాలు ఉన్నప్పటికీ కోమటిరెడ్డి బ్రదర్స్ వివాదం వెనుక మాత్రం మంత్రి పదవి అనే ఆయుధం కనిపిస్తుంది. ప్రభుత్వంలో ఒకే కుటుంబానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులకు మంత్రి పదవి అంటే అది అసాధ్యమేనని,

మంత్రిగా ఉన్నవారు ఎగ్జిట్ అయితే కానీ మరొకరికి ఆ మంత్రి పదవి అవకాశం చేజిక్కుతుంది అనేలా పార్టీలో సంకేతాలు రావడంతో వెంకటరెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా.? అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే వెంకటరెడ్డి తన సోదరుడు రాజగోపాల్ కోసం రాజీ పడి ఆ త్యాగానికి సిద్దమవుతారా.?

లేదా తన పదవిని కాపాడుకోవడానికి సీఎం రేవంత్ ను దాటి అధిష్టానంతో మంతనాలు సాగిస్తారా.? ఏదిఏమైనా ఈ అన్న తమ్ముళ్ల మంత్రి పదవి ఆట కోమటిరెడ్డి vs రేవంత్ రెడ్డి గా సాగనుందా.? మరి రేవంత్ రెడ్డి ఈ సున్నితమైన పార్టీ అంతర్గత సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఇందుకోసం ఎవరిని బుజ్జగిస్తారో.? ఎవరిని తన దారికి తెచ్చుకుంటారో వేచి చూడాలి.

ADVERTISEMENT
Latest Stories