ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయినప్పుడు, తాను కడిగిన ఆణి ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. దాదాపు ఆరు నెలలు జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అదే చెప్పారు.
ఆమెపై సీబీఐ, ఈడీలు ఛార్జ్-షీట్ దాఖలు చేశాయి కనుక ఇక ఆమె జైల్లో ఉండాల్సిన అవసరం లేదని, ఆమె తరపు న్యాయవాదులు వాదించి ఆమెను బయటకు తీసుకువచ్చారు. కానీ ఆమె బయటకు వచ్చినప్పుడు ‘న్యాయం ధర్మం గెలిచాయని’ చెప్పుకున్నారు. ఆణి ముత్యంలా బయటపడ్డారని బిఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. అంటే ఈ కేసులో సుప్రీంకోర్టు ఆమెకి ‘క్లీన్ చిట్’ ఇచ్చేసిపంపించేసిందని, ఇంతటితో ఈ కేసు ముగిసిననట్లే అని ఆమె చెప్పుకున్నట్లే భావించవచ్చు.
ఆమె బయటకు వచ్చేశారు కనుక న్యాయం ధర్మం గెలిచాయి… ఆమె బయటకు వచ్చేశారు కనుక ఆమె కడిగిన ‘ఆణి ముత్యం’గా మారిపోయారు.
ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో మరో ఆణి ముత్యం తయారవుతోంది. అదే.. ఆ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీర్.
ఫార్ములా 1 రేసింగ్ కేసులో ఏ-1గా ఉన్న ఆయనకు ఈరోజు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ రేసింగ్ కేసుని కొట్టి వేయాలని కోరుతూ ఆయన పిటిషన్ వేస్తే, హైకోర్టు ఆయన పిటిషన్నే కొట్టివేసింది. మద్యంతర బెయిల్ కూడా పొడిగించలేదు! ఇదే కేసులో ఈరోజు ఆయన ఈడీ విచారణకు హాజరు కావలసి ఉంది.
హైకోర్టు షాక్ ఇవ్వగానే ఆ పార్టీలో సీనియర్ నేత హరీష్ రావు స్పందిస్తూ, “ఈ కేసులో కేటీఆర్ నేరం చేశారని కోర్టు చెప్పకపోయినా బయట దుష్ప్రచారం జరుగుతోంది. మేము చట్టాన్ని, కోర్టులు, పోలీసులను గౌరవిస్తాము. కేటీఆర్ నిన్న ఏసీబీ విచారణకు వెళ్ళారు. మళ్ళీ పిలిస్తే తప్పకుండా వెళతారు. మాకు కేసులు, అరెస్టులు కొత్త కాదు. ఈ కేసులో నుంచి కేటీఆర్ కడిగిన ఆణి ముత్యంలా బయటకు వస్తారు,” అని అన్నారు.
కనుక కేటీఆర్ అరెస్ట్ ఖాయమని బిఆర్ఎస్ పార్టీ గ్రహించిన్నట్లే భావించవచ్చు. కేటీఆర్ కూడా చెల్లి కల్వకుంట్ల కవితలా ఆణి ముత్యంలా మారాలంటే ఆయన కూడా జైలుకి వెళ్ళక తప్పదు.
జైల్లో యోగా వగైరా చేసుకొని ఫిట్‌గా తయారయ్యేలోగా ఏసీబీ, ఈడీలు కూడా ఛార్జ్-షీట్ దాఖలు చేస్తాయి. అప్పుడు బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తే మళ్ళీ మరోసారి న్యాయం ధర్మం గెలిచిన్నట్లే. బిఆర్ఎస్ పార్టీలో మరో ఆణి ముత్యం తయారైన్నట్లే!




