నాడు భరతుడు… నేడు కేటీఆర్‌!

KTR and KCR amid BRS leadership questions

ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు వయసు 76 ఏళ్ళు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ వయసు 72 ఏళ్ళు. చంద్రబాబు నాయుడు కంటే వయసులో నాలుగేళ్ళు చిన్నవారైనప్పటికీ, కేసీఆర్‌ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఫామ్‌హౌసుకే పరిమితమయ్యారు.

నాడు శ్రీ రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు ఆయన చెప్పులు సింహాసనంపై ఉంచి పాలన చేసినట్లుగా, కేటీఆర్‌, హరీష్‌ రావు కూడా అప్పటి నుంచి కేసీఆర్‌ పేరుతో పార్టీ నడిపిస్తున్నారు. మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకుంటున్నారు.

ADVERTISEMENT

కనుక 2028 శాసనసభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఈ అజ్ఞాతవాసం ముగించుకొని, ఎన్నికల్లో గెలిస్తే పట్టాభిషేకం చేసుకుంటారన్న మాట! ఆయనకు అంత ఓపిక ఉందో లేదో తెలియదు. కానీ అంతవరకు బీఆర్ఎస్‌ పార్టీ ఆయన ‘గుడ్ విల్’ ఉపయోగించుకోక తప్పదు.

ఆ ప్రయత్నాలలో భాగంగానే బీఆర్ఎస్‌ పార్టీ నేడు (ఆదివారం) హనుమకొండలో ‘జనచైతన్య సభ’ నిర్వహిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ఈ సభ అజెండా అని వేరే చెప్పక్కరలేదు.

కేసీఆర్‌ ఎటువంటి కారణమూ చెప్పకుండానే దాదాపు మూడేళ్ళుగా శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. కనీసం తన కుమారుడు కేటీఆర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకైనా కేసీఆర్‌ హాజరవుతారా? కాకపోతే ప్రజలకు, కాంగ్రెస్‌, బీజేపీలకు ఏమని చెప్పుకోగలరు?

ఆయన కంటే వయసులో నాలుగేళ్ళు పెద్దవారైన చంద్రబాబు నాయుడు, నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేడు ముఖ్యమంత్రి హోదాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిత్యం సభలు, సమావేశాలలో పాల్గొంటూనే ఉన్నారు. తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూనే ఉన్నారు.

కనుక రాజకీయాలలో కొనసాగే శక్తి ఏమాత్రం సన్నగిల్లలేదని చంద్రబాబు నాయుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. కనుక ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపడతారంటే నమ్మశక్యంగానే ఉంటుంది.

కానీ దాదాపు మూడేళ్ళుగా ఫామ్‌హౌసులో కాలక్షేపం చేస్తున్న కేసీఆర్‌ మరో రెండేళ్ళు అజ్ఞాతవాసం చేయాలనుకుంటే, 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీని ఒంటిచేత్తో గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపడతారంటే నమ్మశక్యంగా ఉంటుందా?

ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనుకున్నప్పుడు అందుకు తగిన ఓపిక, ఆరోగ్యం కూడా ఉన్నాయని నిరూపించుకోవాలి కదా? లేకుంటే తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలి?

ADVERTISEMENT
Latest Stories