ఉప రాష్ట్రపతిగా బీసీ నేతెక్కడా.?

KTR counters Congress on BC reservations in Telangana politics.

కేటీఆర్ కు కాంగ్రెస్ ను ఇరికించేందుకు, రేవంత్ రెడ్డి బీసీ రాజకీయానికి చెక్ పెట్టేందుకు ఒక మంచి అవకాశం వచ్చింది. తాజాగా అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమి పార్టీలు తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ తో తెలుగు vs తమిళ్ అన్నట్టుగా రాజకీయ క్రీడ మొదలుపెడితే,

ఇప్పుడు కేటీఆర్ దానికి ప్రాంతీయ భావంతో పాటు కులం రంగు పుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కు కట్టుబడి ఉందని, రాష్ట్ర హయాంలో పూర్తి చేయవలసిన లాంఛనాలన్నీ పూర్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ బీసీ రిజర్వేషన్ కు మోకాలు ఒడ్డుతుందంటూ రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ బంతిని కేంద్రం కోర్టులో వేసింది.

ADVERTISEMENT

అలాగే ఇటు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ సైతం తెలంగాణలో బీసీ రిజర్వేషన్ ను అడ్డుకుంటుందంటూ గులాబీ జెండా పై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. రాజకీయాలలో బీసీ లకు న్యాయం జరగాలి అంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం అంటూ టి. కాంగ్రెస్ గట్టి ప్రచారమే చేసింది.

ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ ఉప రాష్ట్రపతిగా బీసీ నేతను ఎందుకు నిలబెట్టలేకపోయారు అంటూ ఎదురు దాడికి సిద్ధమయ్యారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

బీసీ ల విషయంలో చిత్తశుద్ధి ఉందంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ ఇపుడు కాంగ్రెస్ కూటమిలో ఒక బీసీ నేతకు ఎందుకు అవకాశం ఇవ్వలేకయారు.? బీసీ ల రిజర్వేషన్ అంటూ రేవంత్ చేసుకున్న ప్రచారం మొత్తం రాజకీయ ప్రయోజనాల కోసమేనా.? అంటూ కాంగ్రెస్ పై కౌంటర్ అటాక్ చేస్తున్నారు కేటీఆర్.

అయితే మన తెలంగాణ వ్యక్తిని, తెలుగు వాడిని ఉప రాష్ట్రపతిగా ఎన్నుకునేందుకు రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల నాయకులంతా ఏకం అవ్వాలంటూ పార్టీల అధినేతలకు మీడియా ముఖంగా పిలుపునిచ్చారు రేవంత్.

ఇక్కడ రేవంత్ తెలంగాణ అనే సెంటిమెంట్ ను తెలుగోడు అనే భావాన్ని బలంగా తీసుకెళ్లి ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపే వారిని ప్రజల ముందు తెలంగాణ ద్రోహులుగా, తెలుగువారి ముందు రాజకీయ స్వార్ధపరులుగా నిలబెట్టాలని భావిస్తే కేటీఆర్ దానికి బీసీ అనే కులం ముద్ర వేసి తాము ఎన్డీయే కు ఇండియా కూటమి కి సమ దూరం అంటూ బదులుచెప్పారు. బీసీ నేత ఎక్కడా.? అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

ADVERTISEMENT
Latest Stories