సీజేపీ ఆందోళనలు.. వాటితో కేంద్రమంత్రి రాజీనామా పుణ్యమాని ఇప్పుడు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు జెన్-జీ మంత్రం పటిస్తున్నాయి. వారిలో కేటీఆర్ కూడా ఒకరు.
ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ,” ఇప్పుడు సాంప్రదాయ మీడియా స్వేచ్చగా, నిర్భయంగా వ్రాయలేకపోతోంది. కనుక ఇప్పుడు సోషల్ మీడియా ఆ బాధ్యత నిర్వర్తిస్తోంది. దాని వల్లనే పాలకులలో జవాబుదారీతనం కనిపిస్తోంది. సీజేపీ ఆందోళనలతో కేంద్రం దిగి రావడమే ఇందుకు నిదర్శనం.
వాట్సప్ అంకుల్స్- ఇన్‌స్టాగ్రామ్ జెన్-జీకి మద్య జరిగిన పోరుతో గోడీ మీడియాకు చెమటలు పట్టింది. జెన్-జీకి ఈడీ, సీబీఐ వంటి భయాలు ఉండవు. దేనికీ భయపడని వారితో మోడీ పెట్టుకున్నారు. వారి దెబ్బకు అర్దరాత్రి వీడియో మెసేజ్ పెట్టాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికలలో 50 శాతంపైగా జెన్-జీ ఓట్లు వేయబోతోంది. కనుక వచ్చే ఎన్నికలను వారే నిర్దేశించబోతున్నారు,” అంటూ జెన్-జీని పొగిడారు.
అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీ విషయంలో చాలా అలసత్వం ప్రదర్శించింది. నిరుద్యోగ భ్రుతి ఇస్తామని ఇవ్వలేదు. అందువల్ల యువత తమపై చాలా కోపంగా ఉన్నారనే విషయం ఎన్నికలు దగ్గర పడిన తర్వాత కానీ గ్రహించలేదు.
అధికారం కోల్పోయాక ఇప్పుడు, “నాడు మావల్ల కొన్ని తప్పులు జరిగాయి. ఈసారి వస్తే నేను స్వయంగా బాధ్యత తీసుకుంటాను,” అని కేటీఆర్ హామీ ఇచ్చారు.
అంటే మళ్ళీ అధికారంలో వచ్చేందుకు జెన్-జీ తమ పార్టీకి తోడ్పడాలని కేటీఆర్ కోరుతున్నారన్న మాట! అందుకే కేటీఆర్ జెన్-జీ భజన మొదలుపెట్టి ఉండవచ్చు. కానీ ఈవిధంగా మెల్లగా బ్రెయిన్ వాష్ చేసి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించుకో’వాలనే కేటీఆర్ తాపత్రయాన్ని జెన్-జీ గుర్తించలేదా?
అయితే దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఓటు బ్యాంక్ వేరేగా ఉంటుంది. ఆ ఓటు బ్యాంకుని ఏవిధంగా కాపాడుకోవాలో… దాంతో ఎన్నికలలో ఏవిధంగా ఓట్లు రాల్చుకోవాలో అన్ని పార్టీలకు బాగా తెలుసు.
ఒకవేళ జెన్-జీయే వాటి ప్రధాన ఓటు బ్యాంక్ అయ్యుంటే, వారి పట్ల ప్రభుత్వాలు, పార్టీలు వ్యవహరించే తీరే వేరేగా ఉండేది కదా?
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్షాలు జెన్-జీని ఏవిధంగా వాడుకుంటున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. కనుక రాజకీయ పార్టీలు ఆడుకునే రాజకీయ చదరంగంలో జెన్-జీ పావులుగా మారకుండా జాగ్రత్త పడాలి.






