బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలతో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన, ఆలోచించదగ్గ వ్యాఖ్యలు చేశారు.
“శాసనసభ ఎన్నికలలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని, బీజేపీకి బిఆర్ఎస్ పార్టీ బీటీమ్ అని కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. అందుకే మోడీ ప్రభుత్వం కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేయించలేదని వారు చాలా దుష్ప్రచారం చేశారు.
కానీ ఇప్పుడు కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కనుక బీజేపీతో మన పార్టీకి ఎటువంటి సంబందమూ లేదని తేలిపోయింది.
మోడీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్ధులను ఎదుర్కొలేకనే ఈడీ, సీబీఐ, ఐటి శాఖలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయించి లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తోందని మనం చేస్తున్న వాదనలు నిజమని కూడా కల్వకుంట్ల కవిత, అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టులతో మరోసారి స్పష్టమైంది.
కాంగ్రెస్ పార్టీలో కనీసం జాతీయ, రాష్ట్ర నాయకుల మద్య సరైన సమన్వయం కూడా లేదు. ఢిల్లీలో రాహుల్ గాంధీ మోడీని ‘చౌకీ దార్ చోర్’ (కాపలావాడే దొంగ) అని విమర్శిస్తుంటే, ఇక్కడ సిఎం రేవంత్ రెడ్డి మోడీని ‘పెద్దన్న’ అని సంభోదిస్తుంటారు.
అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు మద్యం కుంభకోణం కేసులో అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుని ఖండిస్తుంటే, ఇక్కడ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అదే కేసులో కల్వకుంట్ల కవితని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తుంటారు,” అని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ, సీబీఐలు అనేక ఆధారాలు చూపుతున్నా అవేవీ నిజం కావని కల్వకుంట్ల కవిత నిరపరాధి అని కేటీఆర్ వాదించడాన్ని అర్ధం చేసుకోవచ్చు.
కల్వకుంట్ల కవిత నిరపరాధని బిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నందున, ఇదే కేసులో అరెస్ట్ అయిన అర్వింద్ కేజ్రీవాల్ కూడా నిరపరాధే అనే వారి వాదనలు సహేతుకంగానే ఉన్నాయి. కానీ కేటీఆర్ చెప్పిన్నట్లు ఈ విషయంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు… చాలా పార్టీలు, మీడియా కూడా అయోమయంలో ఉన్నట్లే కనిపిస్తోంది.
ఎందుకంటే అర్వింద్ కేజ్రీవాల్ నిరపరాధి, మోడీ రాజకీయ కక్షకు బలైపోయారని వాదిస్తున్నవారు ఎవరూ ఢిల్లీ మధ్యం కుంభకోణం జరగలేదని చెప్పడం లేదు! ఆ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత నిరపరాధి అని కూడా చెప్పడం లేదు. అంటే కుంభకోణం జరిగింది కానీ అర్వింద్ కేజ్రీవాల్ నిర్దోషని వారు భావిస్తున్నారనుకుంటే, మరి కల్వకుంట్ల కవిత కూడా నిర్దోషే అవుతుంది కదా? కానీ కల్వకుంట్ల కవిత అరెస్టుని ఎవరూ ఖండించడం లేదు.
“అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుని కేసీఆర్ వెంటనే ఖండించారు కానీ కూతురు అరెస్టుని ఖండించలేదు. ఎందుకు?” అని సిఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి అడుగుతున్నారు. అంటే కేసీఆర్, కేటీఆర్ మద్య కూడా ఈ కుంభకోణం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనుకోవాలా?
బీజేపీకి బిఆర్ఎస్ పార్టీ బీ-టీమ్ కాదని కేటీఆర్ తేల్చి చెప్పేశారు కనుక ఇకపై కేసీఆర్ మళ్ళీ బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీలపై కత్తులు దూసి యుద్ధం చేస్తారా? లేక కూతురుని విడిపించుకునేందుకు బీజేపీకి బీ-టీమ్‌గా ఉండేందుకు కూడా సిద్దపడతారా?




