మనోళ్ళ మ్యాజిక్ ముందు పీసీ సర్కార్ ఏపాటి?

KTR three hotels spark political debate

ప్రముఖ భారతీయ ఇంద్రజాలికుడు పీసీ సర్కార్ వేదికపై ఏనుగులను సైతం మాయం చేసేవారని చెప్పుకుంటారు. కానీ మన రాజకీయ నాయకులు ముందు అయన మ్యాజిక్ ఏపాటి? మనవాళ్ళు అంతకంటే పెద్దపెద్దవే మాయం చేసేయగలరు.

ఉదాహరణకు విశాఖలో రుషికొండని గ్రీన్ మ్యాట్స్ పరిచి మాయం చేశారు. అందరూ ఆ మ్యాట్స్ గురించే మాట్లాడుకున్నారంటే అర్థం వారికి అంత పెద్ద రుషికొండ కనపడకపోవడం వల్లనే కదా?

ADVERTISEMENT

ఇదే ఓ మహాద్భుతం అనుకుంటే, హైదరాబాద్‌ నగరం నడిబొడ్డునున్న మూడు స్టార్ హోటల్స్‌ ఎవరికీ కనిపించకుండా దాచేయడం ఇంకెంత గొప్ప అద్భుతం? మాజీ మంత్రి కేటీఆర్‌ ఈ మ్యాజిక్ చేసి దాదాపు 20 ఏళ్ళు ఎవరికీ కనపడకుండా దాచారు.

పీసీ సర్కార్ మాయం చేస్తే అందరూ చప్పట్లు కొట్టి మెచ్చుకుంటారు. కానీ మనవాళ్ళు చేస్తే మెచ్చుకోరా? ఇలాంటి గొప్పగొప్ప మ్యాజిక్ చేసినవారిని మెచ్చుకోవాల్సింది పోయి, దోచేసుకున్నారు… దాచేసుకున్నారు.. అంటూ విమర్శిస్తుండటం చాలా బాధాకరం.

ప్రభుత్వాలు మారనంత వరకు ఇలాంటివి ఎవరికీ కనపడవు. మారగానే మ్యాజిక్ పవర్ క్రమక్రమంగా తగ్గిపోతుంటుంది.. ఒకటొకటిగా బయట పడుతుంటాయి.

కనుక ఇక్కడ వైసీపీ నేతలు “500 కోట్లు పెట్టి రుషికొండపై అలాంటి విలాసవంతమైన భవనాలు నిర్మించి ఇస్తే మీకు వాడుకోవడం చాత కాక మమ్మల్ని అంటారా? ఆయ్!” అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

కనుక రుషికొండ ప్యాలస్‌ మళ్ళీ వినియోగంలోకి రావాలంటే మళ్ళీ జగన్‌ రావాలి.. వాటిలో మకాం పెట్టాలి.. విశాఖ రాజధాని చేయాలి.. అంత వరకు అవి అలా పడుండక తప్పదేమో?

అక్కడ కేటీఆర్‌ హోటల్స్‌పై పడి ఏడుస్తున్నవారికి కూడా ఆయన చక్కటి సమాధానం చెప్పారు. “నా పెళ్ళాం పిల్లలకి బువ్వ పెట్టేందుకు మూడు స్టార్ హోటల్స్‌లో కట్టుకుంటే తప్పా? అయినా నేను ఈ రాజకీయాలు వద్దనుకొని నా హోటల్ బిజినెస్ మీద దృష్టి పెడితే మూడు కాదు.. అవి పది హోటల్స్‌ అయ్యేవి,” అని చెప్పుకున్నారు. కానీ అదీ తప్పే అయ్యింది.

కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ కుమార్‌ రెడ్డి ఏమన్నారంటే, “కేటీఆర్‌ నువ్వు గట్టిగా దృష్టి పెడితే ఒకటిని పది హోటల్స్‌ చేయగలిగినప్పుడు, మరి పదేళ్ళపాటు మంత్రిగా ఉన్నావు కదా? ధనిక రాష్ట్రంగా నీ చేతికి వచ్చిన తెలంగాణను మరింత ధనిక రాష్ట్రంగా మార్చాలి కదా? కానీ దివాలా తీయించేసేవేమిటి?” అని ధర్మ సందేహం వ్యక్తం చేశారు.

అయినా మన ఎదుగుదలని చూసి గిట్టనివాళ్ళు ఇలాగే అసూయతో ఏదేదో మాట్లాడుతుంటారు. అవన్నీ పట్టించుకోకూడదు. ఇంకా ఇలాంటి మ్యాజిక్కులు చాలా చేయాలి కదా?

ADVERTISEMENT
Latest Stories