చంద్రబాబుకి కేటీఆర్‌ వార్నింగ్.. చూస్తూ ఊరుకోము!

KTR Warns Chandrababu Naidu Over Telangana Projects, Water Row

అవును. బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ సిఎం చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మొదట తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి మీదే తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడుగారికి.. ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి అంటూ, “మాకు భేషజాలు, బేసిన్లు లేవని మా అధినేత కేసీఆర్‌ ఎప్పుడో చెప్పారు. అందుకే మీరు పోలవరం, పట్టిసీమ కట్టుకుంటే మేము అభ్యంతరాలు చెప్పలేదు కదా?

ADVERTISEMENT

కానీ మీరు మా ప్రాజెక్టులకు ఎందుకు అడ్డుపడుతున్నారు? కేంద్రం, మీ చెంచాగాడు రేవంత్ రెడ్డి మీ చెప్పుచేతల్లో ఉన్నారనే కదా?మీరు తెలంగాణకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోము,” అని కేటీఆర్‌ హెచ్చరించారు.

ప్రాస కోసం బేషజాలు, బేసిన్లు లేవని చెప్పడం బాగానే ఉంది. కానీ ఏపీలో ఏ ప్రాజెక్టు నిర్మించుకుంటున్నా మొట్ట మొదట అభ్యంతరం చెప్పేది బీఆర్ఎస్‌ పార్టీయే.

చివరికి సముద్రంలో వృధాగా కలుస్తున్న వరద నీటిని వాడుకునేందుకు ప్రాజెక్టులు నిర్మించుకున్నా అభ్యంతరం చెపుతూనే ఉన్నారు.

కానీ సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఎగువన తెలంగాణలో గోదావరిపై ఇంకా ఎన్ని ప్రాజెక్టులు నిర్మించుకున్నా మాకు అభ్యంతరం లేదని చాలా స్పష్టంగా చెప్పారు.

ఈవిధంగా నీళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తూ, ఊహాజనితమైన సమస్యలను భూతద్దంలో నుంచి చూపిస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నది దేనికంటే రాజకీయంగా కాంగ్రెస్‌ పార్టీపై పైచేయి సాధించడం కోసమేనని అందరికీ తెలుసు.

సిఎం చంద్రబాబు నాయుడుని పేరు పెట్టి విమర్శించినా, టీడీపి నేతలు, మంత్రులు స్పందించక పోవడం కూడా బీఆర్ఎస్‌ పార్టీకి కలిసి వస్తోందని చెప్పాలి.

అక్కడ బీఆర్ఎస్‌ పార్టీ సిఎం చంద్రబాబు నాయుడు, నీళ్ళు.. అంటూ రాజకీయాలు చేస్తుంటే, ఇక్కడ ఆంధ్రాలో వైసీపీ ర్యాలీలలో కేటీఆర్‌ ఫోటోలున్న ఫ్లెక్సీలను ప్రదర్శించడాన్ని ఏమనుకోవాలి? ఆంధ్రాకు శత్రువు లేదా ఆంధ్రాని శత్రువుగా భావిస్తున్న బీఆర్ఎస్‌ పార్టీ నేతలు వైసీపీకి మిత్రులా?

బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది కూడా ఏపీలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెపుతుండేది. నేటికీ చెపుతూనే ఉంది కదా? కానీ ఆంధ్రాకు నష్టం కలిగించే తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం నేరం, రాజకీయ కుట్ర అని కేటీఆర్‌ వితండవాదం చేస్తున్నారు.

తన తండ్రిని అందరూ గౌరవించాలని కోరే కేటీఆర్‌, తన తండ్రి కంటే వయసులో, రాజకీయ అనుభవంలో, పాలనలో చాలా పెద్దవారైన సిఎం చంద్రబాబు నాయుడుని ఈవిధంగా హెచ్చరించడం అహంకారమే.. కదా?

ADVERTISEMENT
Latest Stories