అమరావతి నిర్మించడానికి ఇష్టపడని వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చి మూడున్నరేళ్ళయింది. కానీ ఇంతవరకు మూడు రాజధానులను ఏర్పాటు చేయలేదు కానీ ఆ పేరుతో గర్జన సభలు పెట్టి ప్రజల మద్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నాలు మాత్రం గట్టిగా చేసింది.
కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయంటూ రాయలసీమ వైసీపీ నేతలు నానాయాగీ చేశారు. ప్రజలని కూడగట్టి ర్యాలీలు కూడా నిర్వహించారు. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి కర్నూలులో జగన్నాధగుట్ట మీద 10 ఎకరాలలో హైకోర్టు భవన సముదాయం నిర్మిస్తామని, అవి డోన్ పట్టణం వరకు కనిపిస్తాయని చెప్పారు. హైకోర్టుతో బాటు దాని అనుబంద సంస్థలన్నిటినీ కర్నూలుకి తీసుకువస్తామని అప్పుడే న్యాయరాజధానికి పరిపూర్ణత ఏర్పడుతుందని చెప్పారు.
కానీ వైసీపీ ప్రభుత్వం మంగళగిరిలో జ్యూడీషియల్ అకాడమీని ఏర్పాటు చేస్తుండటంతో కర్నూలులో న్యాయవాదులు భగ్గుమన్నారు. హైకోర్టుతో సహా అన్నిటినీ కర్నూలుకి తీసుకువస్తామని చెప్పిన బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, మంగళగిరిలో జ్యూడీషియల్ అకాడమీని ఎందుకు ప్రారంభిస్తున్నారని వారు ప్రశింస్తున్నారు.
ఇందుకు నిరసనగా కర్నూలులో న్యాయవాదులు శుక్రవారం ఉదయం ‘వైసీపీ పాలనలో న్యాయవాదులకు ఇదేం కర్మ?’ అంటూ కొండారెడ్డి బురుజు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం, మంత్రులు న్యాయరాజధాని పేరుతో తమని, కర్నూలు ప్రజలని మభ్యపెట్టారని చాలా ఆలస్యంగా గ్రహించామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో జ్యూడీషియల్ అకాడమీని ప్రారంభిస్తుండటం ద్వారా ప్రభుత్వానికి కర్నూలులో న్యాయరాజధాని పెట్టాలనే చిత్తశుద్ధి లేదని తేలిపోయిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం సామాన్య ప్రజలనే కాక న్యాయవాదులను కూడా మోసం చేయాలని ప్రయత్నించడం చాలా దారుణమని అన్నారు.



