పవన్, తారక్, మహేష్ మిస్సయ్యారు… కానీ..!

LIE Nitin Latest Postersఆగష్టు 11వ తేదీ… గత ఆరు నెలలుగా చర్చలో ఉన్న తేదీ..! అంతలా చర్చించుకోవడానికి ఆ డేట్ లో ఏముంది? నిజమే ఏమీ లేదు. కానీ కొన్ని మాసాలుగా ప్రతి పెద్ద సినిమా విడుదల తేదీ కూడా ఆగష్టు 11నే అని ప్రచారం జరిగింది. విశేషం ఏమిటంటే… కనీసం ఒక్క పెద్ద సినిమా కూడా ఆగష్టు 11 బరిలో లేకపోవడం. అవును… పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కలయికలో రూపొందుతున్న సినిమా ముందుగా ఆగష్టు 11నే విడుదల అన్నారు, తర్వాత దసరాకు షిఫ్ట్ అయ్యింది, ప్రస్తుతం అక్కడ నుండి కూడా షిఫ్ట్ అయ్యిందనుకోండి… అది వేరే విషయం..!

పవన్ సినిమా పక్కకు జరగడంతో జూనియర్ ఎన్టీఆర్ “జైలవకుశ” విడుదల ఆగష్టు 11 పక్కా… అన్నారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుండడంతో, ఆ తేదీకి యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫిక్స్ కావడమే అని భావించారు. అయితే మరో నెల రోజులు వెనక్కి, ప్రస్తుత టాక్ ప్రకారం సెప్టెంబర్ 21వ తేదీగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం అయితే వెలువడలేదు గానీ, షూటింగ్ జరుగుతున్న విధానాన్ని బట్టి సెప్టెంబర్ లో జూనియర్ ఆగమనం ఖాయం అన్న టాక్ వినపడుతోంది.

ADVERTISEMENT

ఇక ప్రిన్స్ మహేష్ బాబు – మురుగదాస్ ల “స్పైడర్” సినిమాను జూన్ 23వ తేదీ విడుదల అని అధికారిక సమాచారం ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ఈ తేదీ నుండి వాయిదా పడిందో, నెక్స్ట్ హైలైట్ అయిన తేదీ ఆగష్టు 11. ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగష్టు 9 కావడంతో, జన్మదినం కానుకగా ఆగష్టు 11కి ఫిక్స్ అయిపోవాలన్న ప్రచారం జరిగింది. అయితే మరికొద్ది రోజులకే ఆగష్టు నుండి అవుట్ అవుతూ, టీజర్ ద్వారా దసరా విడుదల అని అధికారిక ప్రకటన చేసారు.

ఇలా టాలీవుడ్ టాప్ హీరోలైన మహేష్, జూనియర్, పవన్ ల సినిమాల విడుదల తేదీలు తప్పించుకున్న ఆగష్టు 11వ తేదీన చివరికి యువహీరో నితిన్ “లై” సినిమా విడుదల అవుతోంది. దీంతో ఈ సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో అన్న ఆసక్తిలో ట్రేడ్ వర్గాలు ఉన్నాయి. ఈ తేదీ దరిదాపుల్లో మరో సినిమా లేకపోవడం, అలాగే ఆగష్టు 15వ తేదీ సెలవు కావడంతో పెద్ద సినిమాలకు బాగా కలిసోచ్చేదని అప్పట్లో జరిగిన ప్రచారం. మరి దీనిని నితిన్ ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories