వినాయక చవితి వచ్చిందంటే తెలుగువారి మదిలో మొదటగా మెదిలేది ఖైరతాబాద్ వినాయకుడే. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో ఖైరతాబాద్ గణపతి దర్శనమిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఖైరతాబాద్ వినాయకుడు తయారి ప్రతి ఏడాది మేలో ప్రారంభం అవుతుంది. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా పరిస్థితి ఎలా ఉంటుందని అంతా ఆందోళన చెందారు.
అయితే ఈ పనులు ఎప్పటిలానే మొదలు కాబోతున్నాయి. ఈ నెల 18న మొదలయ్యి… ఆగస్టు మూడవ వారం వరకూ జరగబోతున్నాయి. ఈ ఏడాది ఆగష్టు 22న వినాయక చవితి. నిర్మాణ సమయంలోను ఆ తరువాత గణేష్ నవరాత్రుల సమయంలో సాంఘిక దూరం మిగిలిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటిస్తామని నిర్వాహకులు అంటున్నారు.
తొలిసారిగా 1954లో ఒక్క అడుగు ఎత్తుతో ఏర్పాటుచేసిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఏటా అడుగు చొప్పున పెంచుతూ 2014 నాటికి 60 అడుగులకు చేరింది. ఆ తరువాత ఎత్తు తగ్గించడం మొదలు పెట్టారు. గణేష్ ఉత్సవ కమిటి స్థాపింపబడి 66 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది 66 అడుగులు విగ్రహం చెయ్యబోతున్నారు.
విగ్రహం రూకల్పనలో పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 150 మంది నాలుగు నెలలపాటు శ్రమించనున్నారు. దాదాపుగా కోటి రూపాయిలు దీనికోసం ఖర్చు చెయ్యబోతున్నారు. వినాయక చవితి నాటికి పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకోవాలని భక్తులు గణనాథుడిని ప్రార్థిస్తున్నారు.





