వైసీపికి చివరి 24 గంటలు… కోడ్ కూతతో అందరికీ విముక్తి!

శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలకు, లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించబోతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే తక్షణమే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.

ADVERTISEMENT

అప్పుడు ఏపీలో జగన్‌ ప్రభుత్వంతో సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వీలు లేదు. సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచడానికి వీలు ఉండదు.

ఎన్నికలను ప్రభావితం చేస్తాయనుకునే ఏ నిర్ణయమూ అమలుచేయలేదు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ అధికారం అంతా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల చేతిలోనే ఉంటుంది.

ఒకవిధంగా చెప్పాలంటే కేంద్రానికి, నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలకి మరో 24 గంటలు మాత్రమే గడువు ఉన్నట్లు చెప్పవచ్చు. అందుకే ప్రధాని నరేంద్రమోడీ హడావుడిగా దేశమంతా తిరిగేస్తూ అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు.

ఏపీలో వైసీపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ నెల జగన్‌ బటన్ నొక్కుతూ సంక్షేమ పధకం పేరుతో జనాలకు డబ్బు పంచిపెడుతూనే ఉన్నారు. ఇక పంచిపెట్టలేరు కనుక జగన్‌ సభలకు రాకపోతే సంక్షేమ పధకాలు నిలిపివేస్తామని వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో బెదిరింపులకు పాల్పడలేరు. ఒకవేళ పాల్పడితే వారిపై ప్రజలు ఫిర్యాదు చేస్తే మొదటికే మోసం వస్తుంది.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరూ ఇకపై ఎన్నికల సంఘానికి జవాబు చెప్పుకోవలసి ఉంటుంది కనుక వారిని ముఖ్యంగా… పోలీస్ వ్యవస్థని ఇదివరకులా వైసీపి నేతలు విచ్చలవిడిగా ఉపయోగించుకునే పరిస్థితి ఉండదు.

ఈసారి ఎన్నికలలో వైసీపి పెట్రేగిపోకుండా చూడాలనే ఒకే ఒక్క షరతుతోనే టిడిపి, జనసేనలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి. కనుక కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు రేపటి నుంచి మరింత కటినంగా, నిఖచ్చిగా, పారదర్శకంగా వ్యవహరిస్తాయనే ఆశించవచ్చు.

వైసీపి ప్రభుత్వం ఇదివరకులా టిడిపి నేతలపై ఎడాపెడా కేసులు నమోదు చేయలేదు. టిడిపి, జనసేన, బీజేపీ సభలు, సమావేశాలను కూడా అడ్డుకునే అధికారం, అవకాశం రెండూ ప్రభుత్వానికి ఉండదు. ఈ పరిస్థితులలో వైసీపి ప్రభుత్వం కేవలం సిద్దం సభలు నిర్వహించుకోవడానికే పరిమితం కావలసి రావచ్చు.

కనుక దాదాపు 5 ఏళ్ళ తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటలకు ‘కోడ్ కూతతో’ రాష్ట్రంలో అన్ని పార్టీలకు, అన్ని వర్గాల ప్రజలకు వైసీపి నుంచి విముక్తి ప్రారంభం అవుతుందని భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories