“స్పైడర్” సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన వీడియోలపై అంతగా పాజిటివ్ స్పందన రాలేదు గానీ, ప్రతి పోస్టర్ మాత్రం అభిమానులకు కావాల్సిన కిక్ పంచుతూనే ఉంది. తాజాగా వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో యధావిధిగా ప్రిన్స్ మహేష్ బాబు అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చాడు. గన్ పట్టుకుని సెటిల్డ్ గా నిల్చున్న ప్రిన్స్ స్టిల్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో తెలుగు, తమిళ, ఇంగ్లీష్ భాషలలో విడుదల చేసిన ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
“స్పైడర్” ప్రమోషన్స్ కోసం వీడియోల కంటే ఓ విధంగా పోస్టర్లను రిలీజ్ చేయడమే ఉత్తమంలా కనపడుతోంది. ఈ సినిమాపై ఉన్న అంచనాల రీత్యా, వాటిని అందుకునే స్థాయిలో టీజర్లను కట్ చేయడంలో చిత్ర యూనిట్ విఫలమవుతోంది. దీంతో టీజర్లను విడుదల చేసి, అనవసరమైన నెగటివ్ భావాన్ని తెచ్చుకునే కంటే, ఇలాంటి పోస్టర్ల ద్వారా కావాల్సిన కంటెంట్ ను ప్రేక్షకులకు తెలియజెప్పడం మేలు అన్న భావనను అభిమానులే సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు. అయితే ‘స్పైడర్’ పోస్టర్లు ‘1 నేనొక్కడినే’ను గుర్తు చేస్తుండడం విశేషం.


