తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ వినపడుతోంది. న్యాయవ్యవస్థకు సంబంధించిన కధగా చెప్తున్న ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. గతంలో మహేష్ “బిజినెస్ మెన్” చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో వచ్చి బంపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను తెరకెక్కించాలని దర్శకుడు మురుగదాస్ భావిస్తున్నారట. తెలుగు, తమిళ భాషలకు మహేష్ బాబే హీరో కాగా, హిందీలో మాత్రం అక్షయ్ కుమార్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అదే నిజమైతే ఏకకాలంలో రెండు చిత్రాల రూపకల్పన సాధ్యపడుతుందా… అన్న అంశం కీలకం కానుంది. లేదంటే మహేష్ నే హిందీకి కూడా ఒప్పిస్తారేమో చూడాలి.
ఏప్రిల్ 12వ తేదీన ప్రారంభం కానున్న ఈ సినిమాను ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం దర్శక నిర్మాతలు చిత్ర తారాగణం ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు.





