ష్…. అంటూ వచ్చిన తొలి టీజర్ లో హరీష్ జయరాజ్ బ్యాక్ గ్రౌండ్ తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు – ఫస్ట్ టీజర్ టాక్. తదుపరి టీజర్ లో అంతా గందరగోళం, అయోమయం – రెండవ టీజర్ టాక్. ‘బూమ్ బూమ్’ అంటూ విడుదలైన తొలి లిరికల్ పాట – అంచనాలను అందుకోలేకపోయింది, ఇక ‘హాలి హాలి’ అనే రెండవ పాట – తమిళ వాసనతో తీవ్ర నిరుత్సాహంలో ప్రిన్స్ అభిమానులు. ఇది చెన్నై ఆడియో వేడుక ముందు వరకు “స్పైడర్” పరిస్థితి.
మరి చెన్నైలో ఏం జరిగింది? ప్రస్తుతం ‘స్పైడర్’పై ఎలాంటి టాక్ వ్యక్తమవుతోంది? అంటే… ఇప్పటివరకు ఉన్న నెగటివ్ టాక్ ను పూర్తిగా తుడిచివేయడంలో చెన్నైలో జరిగిన ఆడియో వేడుక గ్రాండ్ సక్సెస్ సాధించింది. అవును… ప్రస్తుతం ‘స్పైడర్’పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ వేడుకలో దర్శకుడు మురుగదాస్ తో సహా చిత్ర యూనిట్ అంతా వ్యక్తపరిచిన అపారమైన విశ్వాసంతో ‘స్పైడర్’ యు టర్న్ తీసుకున్నట్లయ్యింది.
దీనికి తోడు ఇప్పటివరకు ఏ పాటలైతే మైనస్ అని భావించామో, వాటి వీడియో టీజర్లు బయటకు వచ్చేపాటికి అవే పాటలు కన్నులవిందుగా ఉండడంతో, ‘స్పైడర్’పై నెలకొన్న ‘నెగటివ్’ టాక్ కాస్త ‘పాజిటివ్’గా మారిపోవడం విశేషం. ‘బూమ్ బూమ్, హాలి హాలి, సిస్లియా’ మూడు పాటలకు సంబంధించిన వీడియో టీజర్లను ఈ ఆడియో వేడుకపై ప్రదర్శించగా, విజువల్ గా అద్భుతంగా ఉండడంతో, హరీష్ జయరాజ్ గట్టెక్కినట్లే భావించవచ్చు.
అయితే ఈ పాటల వీడియో టీజర్లను యూ ట్యూబ్ లో ఇంకా అధికారికంగా విడుదల చేయకపోవడంతో, ఆ వేడుకపై మొబైల్స్ లో రికార్డ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ హంగామాతో హైదరాబాద్ లో 15వ తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బాగా సెట్ చేసినట్లయ్యింది. ఈ వేడుకలో విడుదల కాబోయే ధియేటిరికల్ ట్రైలర్ తో ‘స్పైడర్’పై నమ్మకాలను మరింత రెట్టింపు అయ్యేలా కనపడుతున్నాయి.


