“1 నేనొక్కడినే” సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత దారుణంగా పరాజయం పాలైనా… ఈ సినిమాకున్న క్రేజ్ వేరు. ఒక రకంగా సుకుమార్ ను అగ్ర దర్శకుల జాబితాలోకి తీసుకువచ్చిన సినిమా ఇదే. దీని తర్వాతే సుకుమార్ కెరీర్ పతాక స్థాయిలో కొనసాగుతోంది. అగ్ర హీరోలు వరుసగా కాల్షీట్స్ ఇస్తూ వస్తున్నారు. సక్సెస్ ఒక్కటే ప్రామాణికం కాదని నిరూపించిన “1 నేనొక్కడినే” కాంబో మళ్ళీ సెట్స్ పైకి రాబోతుందా? ఏమో ప్రస్తుతం ఈ వార్త ట్రేడ్ వర్గాల్లో బలంగా వినపడుతోంది.
వరుస వైఫల్యాలతో ఉన్న ప్రిన్స్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “భరత్ అనే నేను” సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నారు అనేది ఖరారైన అంశం. ఆ తర్వాత ప్రిన్స్ ను దర్శకత్వం వహించాలనుకుంటున్న దర్శకుల జాబితా అయితే చాలానే ఉంది గానీ, అందులో త్రివిక్రమ్, బోయపాటి పేర్లు మాత్రం ప్రాధమికంగా వినపడుతోంది. అయితే ఈ జాబితాలో తాజాగా సుకుమార్ పేరు కూడా చేరింది.
అవును… “1 నేనొక్కడినే” వంటి ప్రయోగాత్మకమైన సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించిన సుకుమార్, ఆ సినిమాతో దక్కాల్సిన విజయాన్ని అందుకోలేకపోయినా, విమర్శకుల ప్రశంసలతో పాటు అశేష ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చూరగొన్నాడు. దీంతో ఈ కాంబోలో మరో కొత్త కధ జీవం పోసుకోబోతోందనేది లేటెస్ట్ టాక్. ఇటీవల ప్రిన్స్ ను కలిసిన సుక్కూ ఓ కధ చెప్పారని, దానికి మహేష్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందనేది ఈ వార్తల సారాంశం.


