ప్రతిష్టాత్మక సినిమాల విషయంలో వినిపించే టైటిల్స్ ఇటీవల కాలంలో మరీ హాస్యాస్పదంగా మారుతున్నాయి. రామ్ చరణ్ – బోయపాటి కాంభినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్ పై కొన్ని రోజుల క్రితం జరిగిన రచ్చ తెలిసిందే. “రాజమార్తాండ”గా చెర్రీ రాబోతున్నాడంటూ తెగ హంగామా చేయగా, ఇదంతా ఒట్టి పుకారేనని తేలిపోయింది. ఈ గోల ఇప్పుడిప్పుడే ముగుస్తోందని భావిస్తున్న తరుణంలో తాజాగా మహేష్ 25వ సినిమా టైటిల్ తెరపైకి వచ్చింది.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు “రాజసం” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. మహేష్ కెరీర్ లో 25వ సినిమాగా టాలీవుడ్ లో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకతను సొంతం చేసుకుంది. దీంతో ఏదొక టైటిల్ ను తెరపైకి తీసుకురావాలన్న కూతుహలంతో ఇలాంటివి వస్తాయేమో గానీ, మరీ కామెడీగా మారుతున్నాయి. ఇలాంటి టైటిల్స్ విని కాసేపు నవ్వుకోవడానికి బాగుంటాయి గానీ, అగ్ర హీరోల సినిమాలకు టైటిల్స్ గా పెట్టుకోవడానికి కాదు.



