ఒక కారు డ్రైవర్ గా విధులు నిర్వహిస్తే ఎంత సంపాదించవచ్చు? అదే విధులను ఒక సెలబ్రిటీ దగ్గరో, రాజకీయ నేత దగ్గరో నిర్వహిస్తే ఎంత ఆర్జించవచ్చు? ఇదే సందర్భంలో మిక్కిలి విధేయతను ప్రదర్శిస్తే ఇంకెంత తమ ఖాతాలో వేసుకోవచ్చు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పనవసరం లేదు. అయితే ‘కల్తీ మద్యం’ కేసులో ఏ9 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లాది విష్ణుపై సిట్ నిర్వహించిన పరిశోధనలో కొన్ని అవాక్కయ్యే వాస్తవాలు వెలుగు చూసాయని మీడియా వర్గాల సమాచారం.
మల్లాది విష్ణు కారు డ్రైవర్ గా ఉన్న వ్యక్తి పేరుతో దాదాపు 600 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లుగా సిట్ బృందం గుర్తించిందని మీడియాలో ప్రసారమవుతున్న కధనాలు. దీంతో కల్తీ మద్యం కేసు కాస్త మరో మలుపు తీసుకోబోతుందని రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసు మల్లాది విష్ణు వర్గానికి చుట్టుకోబోతుందని టాక్.
విష్ణు కారు డ్రైవర్ పేరుతో ఉన్న ఆస్తులు ఎవరికి చెందినవో, ఎవరికి బినామీగా కారు డ్రైవర్ వ్యవహరిస్తున్నారో రాజకీయ విజ్ఞులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేతుల్లోకి ఈ కేసు వెళ్ళడం తధ్యమని, సరైన ఆధారాలు చూపించని పక్షంలో ఈడీ సదరాస్తులను సొంతం చేసుకుంటుందని జరుగుతున్న ప్రచారం ఎంత వరకు దారి తీస్తుందో వేచిచూడాలి.





