రాహుల్ పక్కన ఉండగా ఖర్గే ఎలా ఒకే చెప్తారు?

Mallikarjun Kharge As Prime Minister Candidate on INDIA Alliance

నిన్న ఢిల్లీలో 28 పార్టీలతో కూడిన ఇండియా (కూటమి) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓ ఆసక్తికరమైన పరిణామం జరిగింది. కూటమిలో భాగస్వామిగా ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రీ మమతా బెనర్జీ కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేని రాబోయే లోక్‌సభ ఎన్నికలలో ఇండియా కూటమి ప్రధాని అభ్యర్ధిగా నిలబడి పోటీ చేయాలని ప్రతిపాదించారు.

  • దీనిని మరికొన్ని భాగస్వామ్య పార్టీలు కూడా సమర్ధించాయి. కానీ ఖర్గే ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. ముందు ఎన్నికలలో గెలవడంపై దృష్టి పెట్టి అందరం కలిసికట్టుగా బీజేపీతో పోరాడుదామన్నారు.
  • అయితే ఎప్పటికైనా ప్రధాని కావాలని ఉవ్విళ్ళూరుతున్న మమతా బెనర్జీ హటాత్తుగా ఈ ప్రతిపాదన ఎందుకు చేశారు?అందుకు ఖర్గే ఎందుకు వద్దన్నారు?అనే సందేహాలు కలగకమానవు. దీనికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.

ఇండియా కూటమిలో ప్రధాని పదవికి ఆమెతో పాటు బిహార్ సిఎం నితీశ్ కుమార్‌ కూడా పోటీ పడుతున్నారు. కనుక ఆయనతో పోటీ పడటం కంటే ఆయనకు ఆ అవకాశం లేకుండా చేసేందుకు తాను వెనక్కు తగ్గి కాంగ్రెస్‌కు ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించినందుకు లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఏర్పడితే అప్పుడు కాంగ్రెస్‌ తనకు మద్దతు ఇస్తుందని ఆమె భావిస్తున్నారేమో?

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఎదురుచూస్తుంటే ఈ ప్రతిపాదనకు ఖర్గే ఎలా ఒప్పుకోగలరు? ఖర్గే కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు అయినప్పటికీ పెత్తనం అంతా సోనియా, రాహుల్, ప్రియాంకలదే అని అందరికీ తెలుసు. కనుక వారికి ఆగ్రహం కలగనంత వరకే తాను ఆ కుర్చీలో కూర్చోగలనని ఖర్గేకి కూడా తెలుసు. అందుకే ఈ ప్రతిపాదనను తిరస్కరించి ఉండవచ్చు.

నిన్న జరిగిన ఇండియా కూటమి సమావేశంలో చెప్పుకోవలసిన మరో విషయం 28 భాగస్వామ్య పార్టీల మద్య సీట్ల సర్దుబాట్లు.

కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 300 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయాలని మమతా బెనర్జీ ప్రతిపాదించారు.

దీనిలో భాగంగా ముందుగా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్‌-భాగస్వామి పార్టీలు సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరుపుతాయి. ఒకవేళ సర్దుబాటు కాకపోతే ఢిల్లీలో ఇండియా కూటమి స్టీరింగ్ కమిటీ వాటిపై చర్చించి నిర్ణయం తీసుకొంటుంది. దానికి అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలి. ఎట్టి పరిస్థితులలో జనవరి 15వ తేదీలోగా ఇండియా కూటమి సీట్ల సర్దుబాట్ల ప్రక్రియ పూర్తిచేసి, లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయించారు.

ఇది చాలా మంచి ఆలోచనే అని చెప్పవచ్చు. అయితే ముందుగా ప్రధాని అభ్యర్ధిని ప్రకటిస్తేనే ఇండియా కూటమిపై దేశ ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. బీజేపీ గెలిస్తే మళ్ళీ నరేంద్రమోడీ ప్రధాని అవుతారని తెలుసు. కానీ ఇండియా కూటమి గెలిస్తే ఎవరు? అనే సామాన్యులకి ఖచ్చితంగా తెలిస్తేనే దానికి ఓట్లు వేసి గెలిపించాలా వద్దా?నిర్ణయించుకొంటారు. మరి ఇండియా కూటమి ప్రకటించగలదా?

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories