ఉద్యోగులు పదవీ విరమణ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకుంటున్నట్లు, ఇప్పుడు మావో యిస్ట్ అగ్రనేతలు ఆశన్న, మల్లోజుల వేణుగోపాల్‌తో సహా వందల మంది వచ్చి పోలీసులకు ఆయుధాలు అప్పగించి లొంగిపోతున్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నందుకు ప్రభుత్వాలు అందిస్తున్న పారితోషికాలు తీసుకుంటున్నారు.
ఈ ముగింపు వారి సిద్దాంతాల వైఫల్యమా లేక వాటి కంటే తమ ప్రాణాలే ముఖ్యమని భావిస్తున్నట్లా? అంటే పోరాటాలు చేయాలంటే ప్రాణాలు కాపాడుకోవాలి కదా? అని ఆశన్న అన్నారు. తాము ఆయుధాలు వదిలాము కానీ పోరాటాలు కాదన్నారు.
అంటే కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తుంటే తప్పించుకునే మార్గం లేక అందరూ లొంగిపోయి ప్రాణాలు కాపాడుకుని తర్వాత అంతా చల్లబడిన తర్వాత మళ్ళీ ఆయుధాలు చేపట్టి పోరాడవచ్చని మావోయిస్టులు భావిస్తున్నారేమో?
ఇదే వారి వ్యూహమైతే ఈ యుద్ధంలో ఎవరు గెలిచినట్లు?మావోయిస్టులను లొంగదీసుకున్నామని అనుకుంటున్నా కేంద్ర ప్రభుత్వమా? లేక వారికి లొంగిపోతున్నట్లు నటించి ప్రాణాలు కాపాడుకొని మళ్ళీ పోరాటాలు చేయాలనుకుంటున్న మావోయిస్టులా?
ఇంతకాలం మావోయిస్టుల తలలకు లక్షలు, కోట్లతో వెల కట్టిన కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు వారికి లక్షలు పంచి పెడుతుండటం ఆశ్చర్యకరమే.
చివరిగా వారికీ, ప్రభుత్వానికి ఒక ప్రశ్న: మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించగలిగిందా… లేదా? రేపు మావోయిస్టులు మళ్ళీ పోరాటాలు మొదలుపెడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది?
వారు అడవులలో తుపాకులు పట్టుకొని తిరుగుతుంటే బయట అన్ని రాష్ట్రాలలో అవినీతి, అక్రమాలు కొండల్లా పెరిగిపోయాయి కదా?వాటిని వారు పట్టించుకోరా?ఇన్నేళ్ళు అడవుల్లో ఆకలిదప్పులు అనారోగ్యాలు, ప్రాణభయం భరిస్తూ మావోయిస్టులు చివరికి ఏం సాధించగలిగారు?




