ప్రేమలు, పెళ్ళిళ్ళు స్టోరీలు చాలానే విన్నాము. ఇంకా వింటూనే ఉంటాము. ప్రేమకు పెళ్ళితో శుభం కార్డు పడుతుందంటారు. వారు ఏ ఉద్దేశ్యంతో ఈ మాట అన్నప్పటికీ అది నిజమే!
అక్కడితో ప్రేమకు ముగింపు పలికి వాస్తవ జీవితంలోకి అడుగు పెడతారు దంపతులు. కొందరు పెళ్ళి తర్వాత కూడా ఆ ప్రేమను కొంత కాలం కొనసాగించగలుగుతారు. మరికొందరు ఏడాది రెండేళ్ళు లేదా పదేళ్ళ వరకు కొనసాగించ గలుగుతారు. అతి కొద్ది మంది మాత్రమే జీవితాంతం ప్రేమను కొనసాగించగలుగుతారు… అని అంటే అందరికీ కోపం వస్తుంది.
కానీ సర్దుకుపోతూ జీవించడం మొదలుపెట్టినప్పుడు ఇక ప్రేమ ఎక్కడ ఉంటుంది?దానినే ప్రేమ అనుకున్నా పర్వాలేదు. కానీ ఇప్పుడీ డిస్కషన్ ప్రేమ, పెళ్ళి గురించి కాదు. పెళ్ళి 2.0 వెర్షన్ గురించి!
బంధుత్వాలకు, సంతోషానికి కొత్త నిర్వచనాలుగా ఈ కొత్త వెర్షన్‌లో నిశ్చయ తాంబూలప్పుడే బస్సులు వేసుకొని బంధుమిత్రులతో వాలిపోవడం, కాఫీలు, టిఫినీలు మొదలు పెళ్ళి కాని పెళ్ళి భోజనాలు, సారె, ఫోటో షూట్ వగైరా యాడ్ చేసుకున్నాము.
పెళ్ళి 2.0 వెర్షన్‌లో ‘ప్రీ-వెడ్డింగ్ షూట్’ కూడా ఇప్పుడు తప్పనిసరి. ఫోటో గ్రాఫర్స్ దర్శకత్వంలో వారి క్రియేటివిటీని బట్టి ఆ షూట్‌లో కాబోయే దంపతులు ఏమేమి చేసేయవచ్చో చెపుతుంటారు. అలా చేసుకుపోవాలి. ఇదే జీవితంలో మధురానుభూతిగా పరిగణింపబడుతుంది.
కానీ ఏ కారణం చేతయినా పెళ్ళి ఆగిపోతే, ఈ తతంగం అంతా ‘ఎంబారసింగ్’ అని సరిపెట్టుకొని మరొకరితో మరో ఫోటో షూట్‌లో పాల్గొనడం ఇప్పుడు ఎవరూ తప్పుగా భావించడం లేదు.
తెలుగువారి పెళ్ళి 1.0 వెర్షన్‌లో మెహందీ, సంగీత్, బ్యాచిలర్ పార్టీ వంటివి ఉండేవి కావు. కానీ పెళ్ళి 2.0 వెర్షన్‌లో ఆ సాఫ్ట్ వేర్ కూడా యాడ్ చేసుకొని విరివిగా వాడుకుంటున్నాము.
పెళ్ళి 2.0 వెర్షన్‌లో ‘డెస్టినేషన్ వెడ్డింగ్’ అనే కొత్త సాఫ్ట్ వేర్ యాడ్ చేసుకున్నాము. కాస్త దూరాభారమైన ఏ రాజస్థాన్ లేదా ఇటలీకో వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇప్పుడు అవసరమే.
ఒకప్పుడు ఇంటి ముందు పందిరి వేసి పెళ్ళి కానిచ్చేసేవారు. నెల రోజుల ముందుగా బంధువులు వాలిపోయేవారు. అందరూ కలిసి స్వయంగా పిండి వంటలు, భోజనాలు, పెళ్ళి కూతురు సారె వగైరా తయారు చేసేసేవారు.
కానీ ఇప్పుడంత తీరిక, ఓపిక, ప్రేమలు ఎవరికీ లేవు. కనుక 2.0 వెర్షన్‌లో క్యాటరింగ్, డెకరేషన్, ఫోటో గ్రాఫర్స్ యాడ్ చేసుకోక తప్పలేదు. అక్షింతలు, మంగళసూత్రం, సారెతో సహా సకలం ఏర్పాటయిపోతున్నాయి. కనుక ఎవరి పెళ్ళిలో వారే అతిధులు. ప్లేట్లు పట్టుకొని క్యూలో నిలబడి తినేసి, ఆ తర్వాత మళ్ళీ క్యూలో నిలబడి గిఫ్టులు, నగదు కవరులు వధూవరుల చేతిలో పెట్టేసి సాక్ష్యం కోసం ఫోటోలు తీయించుకుంటే చాలు.
నాడు అలా పెళ్ళిళ్ళు చేసుకున్నవారు ప్రేమించుకున్నా, ప్రేమించుకోలేకపోతున్నా నేటికీ కలిసే జీవిస్తున్నారు. కానీ కళ్యాణ మండపాలకు లక్షలు చెల్లించి లేదా అంగరంగ పెళ్ళిళ్ళు చేసుకున్నవారు ఎక్కువ కాలం కలిసి జీవించలేకపోతున్నారు.
నాడు జాతకాలు చూసి చేసేవారు కనుక ఆ పెళ్ళిళ్ళు నిలబడ్డాయి ఇప్పుడు ప్యాకేజీలు మాత్రమే చూస్తున్నారు కనుక నిలబడటం లేదనుకోవడానికి లేదు. జాతకాలు చూసి చేసినా ఒకరి పద్దతులు, అలవాట్లు మరొకరికి నచ్చడం లేదు. పైగా ఉద్యోగాలు… పని ఒత్తిడి ఉండనే ఉంటుంది. కనుక సాఫ్ట్ గానే చాలా మంది విడిపోతున్నారు.
ఇలా పెళ్ళి చేసుకున్న వారందరూ అలాగే విడిపోతున్నారని కాదు దీనర్ధం. పెళ్ళి 2.0 వెర్షన్ సాఫ్ట్ వేర్‌లోనే అనేక బగ్స్ ఉన్నాయి. కానీ వాటిని ప్రేమ అనే యాంటీవైరస్‌తో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోవడం వల్లనే పెళ్ళి 2.0 వెర్షన్ డిఫెక్టివ్ అనిపిస్తుంది అంతే! మరి పెళ్ళి 3.0 వెర్షన్ ఎలా ఉంటుందో?







