“పెళ్ళి అనేది బంగారు పంజరం వంటిది.. లోపల బందీలుగా ఉన్నవారు బయటపడాలనుకుంటారు… బయట ఉన్నవారు ఆ బంగారు పంజరంలోకి ప్రవేశం ఎప్పుడు దొరుకుతుందా?అని ఎదురుచూస్తుంటారు…” అని ఓ ప్రముఖ కవి చెప్పాడు.
ఇది నూటికి నూరు శాతం వాస్తవం కాకపోవచ్చు కానీ వాస్తవమే. సమాజంలో జరుగుతున్న ఘటనలు చూస్తూంటే అవుననిపిస్తుంది.
తెలంగాణలో జరిగిన ఈ రెండు తాజా ఘటనలు ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ ఊర్లు, పేర్లు అనవసరం.
ఓ టీనేజ్ ప్రేమ జంట ఇంట్లో పెద్దలు తమకు పెళ్ళి చేయరని భావించి రైలు కింద పడి చనిపోయారు. పెళ్ళై ఇద్దరు పిల్లలున్న భార్యాభర్తలు మనస్పర్ధలు పెరగడంతో ఆ తల్లి పిల్లలకు విషం తినిపించి తాను విషం తిని చనిపోయింది. ఈ రెండు ఘటనలు పూర్తిభిన్నమైనవే కానీ వివాహం, వైవాహిక జీవితానికి సంబంధించినవే.
ప్రేమ ఓ మధురానుభూతి… ఆ అనిర్వచనీయమైన ఆనందంలో ఉన్నప్పుడు కులమతాలు, పెద్దలు, సమాజం, పెళ్ళి వంటివి ఏవీ గుర్తుకురావు. కానీ ఏదో రోజు ఆ రోజు తప్పక రానే వస్తుంది. కానీ అందరి ప్రేమలకు ‘పెళ్ళి గ్యారెంటీ’ ఉండదు. ఈ విషయం చాలా ఆలస్యంగా తెలుస్తుంది.
ఇన్ని సినిమాలు, చుట్టూ ఉన్న సమాజం చూస్తూ అనేక తెలియని విషయాలు తెలుసుకుంటునప్పుడు ప్రేమ-పెళ్ళి గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో తెలీదు. కానీ పెళ్ళి చేసుకోలేకపోతే జీవితం వ్యర్ధం అనుకుంటూ ఈవిదంగా అర్ధాంతరంగా ముగిస్తుంటారు.
పెళ్ళి చేసుకొని చాలా సంతోషంగా, అన్యోన్యంగా కాకపోయినా ‘కాస్త బాగానే’ ఉంటున్నవారి సంఖ్యే ఈ లోకంలో ఎక్కువ. సర్దుకుపోకపోతే జీవితం దుర్భరమవుతుంది… సర్దుకుపోతున్నా దుర్భరంగానే ఉంటుంది. ఈ రెండు దుర్భరాలలో ఏది భరించగలరనేది చాలా ముఖ్యం. వీటిలో ఒకటి లేదా రెండూ భరించలేకపోయినా విషాదకరమైన ముగింపులు ఉంటాయి.
కానీ ఇదే జీవితం కాదు… జీవితానికి ముగింపు ఇది కాదు… అని గ్రహిస్తే సమాజంలో ఇటువంటి విషాదాలు తగ్గుతాయి.
‘ఒడ్డున కూర్చుని సలహాలు చెప్పేవాడికి ఏం తెలుసు ఈదలేక నీళ్ళలో మునిగిపోతున్నవాడి బాధ, కష్టం?’అని కూడా అనుకోవచ్చు. కానీ ఒడ్డున కూర్చున్నవాడికే మునుగుతున్నవాడిని బయట పడేందుకు ఏమైనా సాయం చేయగలడు.
చివరిగా ఒక మాట! జీవితం ఇన్‌స్టాంట్ కాఫీ వంటిది కాదు… ఫిల్టర్ కాఫీ వంటిది. అనుభవాలతో జీవితం ఫిల్టర్ అవుతున్నకొద్దీ జీవితం చిక్కబడుతుంది. ఆ రుచి తెలియాలంటే జీవితం అనుభవించాల్సిందే!







