“మాస్ మసాలా సీజన్ ముగిసిందా?”

Mass masala heroes

హీరోలు ఎప్పుడూ హీరో వేషాలే వేయాలా? తప్పనిసరా?అంటే అవుననే అంటున్నారు అభిమానులు, ఇప్పటి ప్రేక్షకులు.

అభిమానులు తమని హీరోలుగానే చూడాలనుకుంటున్నారు కనుక రజనీ కాంత్ వంటి సీనియర్లు కూడా హీరో వేషాలు వేయక తప్పడం లేదు.

ADVERTISEMENT

కానీ ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు, మురళీమోహన్, చంద్రమోహన్ వంటి వారందరూ అనేక రకాల పాత్రలు చేసేవారు. అభిమానులకు అతీతంగా తెలుగు ప్రేక్షకులు వారికీ, వారి సినిమాలకు బ్రహ్మరధం పట్టేవారు.

ఎన్టీఆర్ వయసులో ఉండగానే బడిపంతులు, భీష్మ వంటి సినిమాలు చేస్తే అవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఏఎన్ఆర్ చక్రధారి, సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు, ఎవ్వర్ గ్రీన్ సినిమాలుగా నిలిచిపోయాయి.

కృష్ణంరాజు-శోభన్ బాబు రాజు జీవన తరంగాలు, చిరంజీవి తదితరులు మనవూరి పాండవులు, మోహన్ బాబు-చంద్రమోహన్ 16 ఏళ్ళ వయసు…. ఇలా చెప్పుకుంటూ పోతే వాటికి అంతే లేదు.

అలాంటి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చాలా సినిమాలు 100 లేదా 50 రోజులు పైనే ఆడాయి. కలెక్షన్స్ కనక వర్షం కురిపించాయి. ఆ సినిమాలు, వాటిలో వారు చేసిన విభిన్నమైన పాత్రలతో వారందరికీ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి.

ఇదంతా ఇప్పుడు ఎందుకంటే, ఇమేజ్ చట్రంలో చిక్కుకుపోయిన మన హీరోలు మూస కధలతో సినిమాలు చేస్తూ సినీ పరిశ్రమ నుంచి అవమానకరంగా నిష్క్రమించకూడదనే!

ఉదాహరణకు మాస్ మసాలా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ రవితేజ… వరుసపెట్టి అలాగే చేసుకుపోతూ ఎదురుదెబ్బలు తింటున్నారు. అలాంటి డైనమిక్ హీరో కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలా?

ఆయన తాజా ఇంటర్వూలో తాను నటిస్తూ సెట్స్‌లోనే చనిపోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. కానీ ఇలాంటి సినిమాలు, పాత్రలే చేస్తుంటే అంతవరకు ఆయన ఇండస్ట్రీలో కొనసాగలేరు. ముందుగానే తప్పుకోవలసిరావచ్చు.

సినీ పరిశ్రమలో నాగార్జున, జగపతిబాబు రకరకాల పాత్రలు, సినిమాలు చేస్తున్నారు కదా? అమితాబ్ బచ్చన్ ఈ వయసులో కూడా తన వయసుకు తగిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కదా?

శర్వానంద్ నటించిన ‘బైకర్’ ఫస్ట్ గ్లిమ్స్‌ ఈవెంట్‌ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దానిలో డా.రాజశేఖర్ మాట్లాడుతూ, “నేను ఎప్పటికీ సినిమాలు చేస్తూనే ఉండాలనుకుంటున్నాను. కానీ హీరో వేషాలే చేస్తానంటే కుదరదు కనుక ఇకపై అన్ని రకాల వేషాలు (పాత్రలు) చేయాలనుకుంటున్నాను. బైకర్ సినిమాతో నాకు అటువంటి అవకాశం లభించింది. ఇది నా కెరీర్‌ని మలుపు తిప్పుతుందని భావిస్తున్నాను,” అని అన్నారు.

హీరో వేషాలు మాత్రమే చేయాలని గిరిగీసుకొని కూర్చుంటే ఏమవుతుందో, ఏం చేస్తే మళ్ళీ ఇండస్ట్రీలో నిలద్రొక్కుకోవచ్చో డా.రాజశేఖర్ చెప్పారు.

కనుక రవితేజ లేదా అలాంటి మిగిలిన హీరోలు విలన్‌, క్యారక్టర్ రోల్స్ కూడా చేసి జగపతిబాబులా సెకండ్ ఇన్నింగ్స్ దిగ్విజయంగా కొనసాగిస్తే, అవీ చేయలేనప్పుడు సినీ పరిశ్రమ నుంచి సగౌరవంగా నిష్క్రమించవచ్చు. ప్రజల మనసులలో శాశ్వితంగా నిలిచిపోగలరు.

ADVERTISEMENT
Latest Stories