దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రాలలో అధికారం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది అంటే అందుకు ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత వర్గ పోరు బహిరంగంగా ప్రకటించడమే.
పార్టీలో ఉండే మితిమీరిన స్వేచ్ఛ, క్రమశిక్షణ లోపం కాంగ్రెస్ పార్టీని నేటితరం యువతకు దూరం చేస్తుంది అంటే అతిశయోక్తి కాదేమో. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ విధానాలను ఇప్పటికి సరిచెయ్యలేకపోతుంది, పార్టీ నేతలను సరైన దారిలో నిలబెట్టలేకపోతుంది.
ఉదాహరణకు తెలంగాణ కాంగ్రెస్ విషయానికొస్తే, నిన్నమొన్నటి వరకు ఒకే తాటి మీదనున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇక కాంగ్రెస్ మార్క్ రాజకీయం మొదలుపెట్టి, తమ అంతర్గత వర్గ పోర్టులను బహిరంగం చేస్తున్నారు. మొన్న జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తో మొదలైన ఈ రచ్చ ఇప్పుడు చిన్నా రెడ్డి vs మేఘా రెడ్డి వరకు వెళ్ళింది.
నిన్న వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నా రెడ్డి మీడియా ముందుకొచ్చి మరి సొంత పార్టీ ఎమ్మెల్యే పై విమర్శలు గుప్పించారు. దశాబ్దాల నుంచి తానూ పార్టీ కోసం శ్రమిస్తున్నా కేవలం డబ్బు కోసం తనకు టికెట్ నిరాకరించారని, వలస పార్టీ నేతలకు అవకాశాలు కల్పిస్తూ వనపర్తి ని నాశనం చేస్తున్నారంటూ వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే పై చిన్నా రెడ్డి హాట్ కామెంట్స్ చేసారు.
అయితే దానికి కౌంటర్ గా ఇప్పుడు అదే వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డి మీడియా ముందుకొచ్చి తన ఫై రాజకీయ విమర్శలు చేసిన చిన్నా రెడ్డి పై చర్యలు తీసుకోకుంటే పార్టీ అధిష్టానం పై పోరాటం చేస్తానంటూ ప్రకటించారు. చిన్నా రెడ్డి ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని, ఎమ్మెల్యే గెలిచిన నాటి నుంచి తనకు లక్ష్యంగా చేసుకుని చిన్నా రెడ్డి రాజకీయం చేస్తున్నారని,
ఆయన పై పార్టీ సస్పెన్షన్ వేటు వెయ్యాల్సిందే అని లేకుంటే తన పోరాటం ఆగదంటూ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసారు మేఘా రెడ్డి. చిన్నా రెడ్డి నేను భరిస్తున్నా కాబట్టే ఇంకా పార్టీలో కొనసాగుతున్నా అంటూ ప్రకటిస్తే మేఘా రెడ్డి చిన్నా రెడ్డి బరితెగించారు అంటూ ప్రకటిస్తున్నారు. ఇలా ఇద్దరు నేతలు ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటూ కాంగ్రెస్ మార్క్ రాజకీయాన్ని మరోసారి తెరమీదకు తెచ్చారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి ముందునుంచి పెద్ద తలనొప్పిగా ఉండే ఈ అంతర్గత పోర్టులు ఇప్పుడు ఇలా మీడియా ముందుకు రావడంతో కాంగ్రెస్ ఎప్పటికి మారదా.? కనీసం తన పార్టీ నేతలను కూడా కట్టడి చెయ్యలేని దీన స్థితిలో ఉంటుందా.? అంటూ కామెంట్స్ ఎదురవుతున్నాయి.
ఇటు సీఎం రేవంత్ రెడ్డి కి ప్రభుత్వ పాలనతో పాటుగా ఈ అంతర్గత విభేదాల సర్దుబాట్లు కూడా పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, చిన్నా రెడ్డి, మేఘా రెడ్డి ఇలా పార్టీలో ఉండే సొంత సామాజికవర్గ నేతలే రేవంత్ రెడ్డి కి తలనొప్పిగా మారుతూ, ప్రత్యర్థులకు ఆయుధాలు అందిస్తున్నారు.




