మేమంతా సిద్ధం సభలలో ప్రసంగిస్తున్న జగన్ ఆ పార్టీ తరుపున ఎన్నికల బరిలో నిలబడుతున్న అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ పదే పదే కొన్ని పదాలను వాడుతున్నారు. ఈ అభ్యర్థి చాలా మంచి వాడు, సౌమ్యుడు, నాకు ఆప్తుడు, కానీ ఆర్థికంగా మాత్రం అంతంత మాత్రమే….అంటూ తానూ ఇచ్చిన పేదలకు పేతందారులకు మధ్య యుద్ధం అనే నినాదానికి బలం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారు.
తన పార్టీ తరుపున పోటీ చేయబోతున్న నేతలు ఆర్థికంగా బలమైన నేతలు కాదని చెప్పాలనే ఉద్దేశంతో జగన్ ఈ అంతంత మాత్రం అనే మాటను పదేపదే ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అంతంత మాత్రం అనే మాటను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తూ అదే జగన్మోహన్ రెడ్డికి కౌంటర్లు ఇస్తున్నారు మీమర్స్.
వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, మహిళల భద్రతా అంతంత మాత్రమే, ఇచ్చిన హామీల అమలు అంతంత మాత్రమే, పోలవరం అంతంత మాత్రమే, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు అంతంత మాత్రమే, మధ్య పాన నిషేధం అంతంత మాత్రమే, యువతకు ఉపాధి అంతంత మాత్రమే, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండరు అంతంత మాత్రమే…ఇలా జగన్ ఐదేళ్ల పాలన అంతా అంతంత మాత్రమే…అంటూ సోషల్ మీడియాలో వైసీపీ ని ట్రోల్ చేస్తున్నారు.
అయితే ఎందులో అయినా తనకు పోటీ అంటూ లేకుండా చేయాలనే తలంపుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్ మోహన్ రెడ్డి గత అయిదేళ్లుగా నిర్విరామంగా పని చేస్తున్నట్లుగా కనపడుతోంది. ఓ ముఖ్యమంత్రిగా ఏపీ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పాలంటే కష్టమేమో గానీ, సోషల్ మీడియాకు ఎలాంటి వినోదాన్ని అందించారు అంటే, చెప్పుకునే సంఘటనలు మాత్రం అంతంత మాత్రం కాదనే చెప్పాలి.
టేబుల్ మీద పేపర్ చూసి చదవడం కూడా రాలేక, తెలుగు భాషను ఖూనీ చేసే విధంగా ఉచ్చరించి కామెడీ పండించిన జగన్ మోహన్ రెడ్డి వీడియోలకు సోషల్ మీడియాలో కొదవలేదు. గత నాలుగున్నరేళ్ళుగా జరుగుతోన్న ఈ తతంగం ప్రస్తుతం తారాస్థాయిని తాకింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం జగన్ చేస్తోన్న బస్సు యాత్ర మరియు ఆయా నియోజక వర్గాలలో జరుపుతోన్న బహిరంగ సభల ద్వారా లెక్కకు మించిన వీడియోలు సోషల్ మీడియా జనులకు వినోదాన్ని పంచుతున్నాయి.
‘రానీ బాబు రానీ బాబు ఏయ్ ఏయ్ రానీ రానీ..,’ అంటూ మొదలైన వీడియోతో, అర్ధం పర్ధం లేని ఉచ్ఛారణ (బహుశా ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ కనిపెట్టని భాష ఏమో).., వీక్షకులలోకి అది నెగటివ్ గా వెళ్తుందో, చులకనగా చూస్తారో అన్న విషయాన్ని పక్కన పెడితే ‘మేమర్స్’కు మాత్రం ప్రతి రోజూ సరిపడ పని కల్పిస్తున్నారు ఏపీ సీఎం.
రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమల ద్వారా పెట్టుబడులు తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించాల్సిన ముఖ్యమంత్రి, ఈ విధంగా పని కల్పించడం నిజంగా హాస్యాస్పదమే. మూడు రాజధానులంటే ‘గంజాయి క్యాపిటల్, ఎర్ర చందనం క్యాపిటల్, డ్రగ్స్ క్యాపిటల్’ అనే వైరల్ వీడియోల మాదిరి ఈ విధంగా మేమర్స్ కు కావాల్సినంత స్టఫ్ ని ఇచ్చామని చెప్పుకున్నా ఆశ్చర్యం లేదేమో!
‘ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండాలి’ అనే కాంక్షను వెలిబుచ్చిన జగన్ ఆకాంక్ష నెరవేరుతుందో లేదో గానీ, ప్రతి ఇంట్లో ఉన్న మొబైల్స్ లో వినోదాన్ని మాత్రం పుష్కలంగా అందివ్వగలుగుతున్నారు. ఈ స్థాయి వినోదాన్ని ప్రజల మెప్పు పొందిన చంద్రబాబు గానీ, వైఎస్సార్ గానీ అందివ్వలేదు. ఆ మాటకొస్తే తన సినిమాల ద్వారా పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వలేకపోయారు. ‘సోషల్ మీడియా స్టార్’గా అవతరించే క్రమంలో ఇదంతా భాగమేనేమో మరి..!




