తెలంగాణ మంత్రి కొండా సురేఖ సమంత – నాగ చైతన్య వ్యక్తిగత జీవితాల మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద రాజకీయ దుమారాన్నే లేపాయి. అటు సినీ పరిశ్రమ నుండి కూడా ఎన్నడూ రాని స్పందన, ఎవరికీ దక్కని మద్దతు నాగార్జున కుటుంబానికి, సమంతకు దక్కిందని చెప్పాలి.
ఇండస్ట్రీ పెద్దన్నయ్యగా భావించే మెగా స్టార్ చిరంజీవి నుంచి ఇండస్ట్రీ కి పట్టిన చీడ అని చెప్పుకునే రాంగోపాల్ వర్మ వరకు ప్రతి ఒక్కరు మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం తమ వ్యక్తిగత జీవితాలను బజారుకు లాగడం రాజకీయ నాయకులకు తగునా.? రాజకీయాలలో ఉండే వారు చాల బాధ్యతగా వ్యవహరించాలే కానీ ఇలా చౌకబారు విమర్శలు చేయడం తగదు అంటూ అటు నాగార్జున కుటుంబం మొత్తం సోషల్ మీడియా వేదికగా సురేఖకు కౌంటర్ ఇచ్చారు.
అలాగే నాగార్జున కుటుంబం మీద సమంత మీద సురేఖ చేసిన వ్యాఖ్యలు హీనమైన చర్యగా అభివర్ణించారు హీరో తారక్. ఇక మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇక పై ఇటువంటి వ్యాఖ్యలకు మేము మౌనంగా ఉండబోమని, మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగితే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు.
బాధ్యతాయుత పదవిలో ఉన్నవారు ఇలా సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలతో రాజకీయం చేయడం బాధాకరం అంటూ చిరు, వెంకీ తమ స్పందన తెలియచేసారు. సినీ ప్రముఖులు, సినీ కుటుంబాల పై రాజకీయ నాయకులు చేసే నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ హీరో అల్లు అర్జున్ తన X లో పోస్ట్ చేసారు.
ఇక డీగ్రేడ్ సినిమాలు తీస్తూ ఏపీ రాజకీయాలలో వేలు పెట్టి వైసీపీకి మద్దతుగా టీడీపీ, జనసేన అధినేతల మీద అదే డీ గ్రేడ్ విమర్శలు చేసిన రాంగోపాల్ వర్మ సైతం కొండా సురేఖ వ్యాక్యలను తప్పుబట్టారు. 4 th గ్రేడ్ వెబ్ సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు మీడియా సాక్షిగా సురేఖ లాంటి ఒక మహిళా నేత మాట్లాడడం దారుణం అంటూ తనదైన స్టైల్ లో ఆర్జీవీ నాగార్జున కుటుంబానికి తన మద్దతు తెలియచేసారు.
ఇక హీరో నాని స్పందిస్తూ రాజకీయ నాయకులను చూస్తుంటే అసహ్యం వేస్తుందని, రాజకీయ నాయకులు, గౌరవప్రద స్థానంలో ఉన్న వ్యక్తులు ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు, నీచమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరం అంటూ సురేఖ వ్యాక్యలను ఖండించారు. అయితే ఇలా నాగార్జున కుటుంబానికి, సమంతకు మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ఇండస్ట్రీ పెద్దలంతా కలిసికట్టుగా ముందుకు రావడం నిజంగా హర్షించదగ్గ పరిణామమనే చెప్పాలి.
ఇక మంత్రి కొండా సురేఖ కూడా తానూ సమంత మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించి నాగార్జున కుటుంబాన్ని ఈ వివాదంలోకి తీసురావడం యాదృచ్ఛికమని, ఇది కేవలం కేటీఆర్ చేసిన దారుణాలను ప్రజలకు వివరించడానికి మాత్రమే చేసిన వ్యాఖ్యలుగా పరిగణించాలి అంటూ తన వ్యాఖ్యలు పై బాధపడిన కుటుంబాలకు క్షమాపణలు తెలియచేసారు.
అయితే కేటీఆర్ విషయంలో మాత్రం తానూ తగ్గేదెలా అంటూ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టారు కొండా సురేఖ. కేటీఆర్ మూలంగా తానూ అనుభవించిన మానసిక క్షోభ మరొకరు అనుభవించకూడదనే ఉద్దేశంతో సమంతకు, నాగార్జున కుటుంబానికి తానూ క్షమాపణలు తెలియచేస్తున్నట్లు ప్రకటించారు కొండా సురేఖ. చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పడం కూడా స్వాగతించదగ్గ పరిణామమే అవుతుంది.




